సాక్షి, హైదరాబాద్: రహదారులపై వేగానికి కళ్లెం వేసేందుకు రవాణాశాఖ సిద్ధమైంది. అతి వేగం నియంత్రణకు టోల్‌గేట్లను వినియోగించుకునేందుకు సమాయత్తమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాదం నేపథ్యంలో వాహనాల వేగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టోల్‌గేట్ల మధ్య దూరాన్ని బట్టి వాహనాల వేగా న్ని లెక్కించాలని రవాణా శాఖ నిర్ణయించింది. అనుమతించిన దానికంటే ఎక్కువ వేగంగా ప్రయాణించినట్లు నిర్ధ్దారణ అయితే చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది.
ఒక టోల్‌గేట్ నుంచి మరో టోల్‌గేట్ చేరడానికి ఎంత సమయం పడుతుందనే విషయాన్ని లెక్కగట్టి అంత కంటే ముందుగా చేరితే అతి వేగంతో ప్రయాణించినట్లు గుర్తిస్తారు. ఆ వాహనదారులపై చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.