పెద్దపల్లి, న్యూస్‌లైన్ : నాలుగు వరుసల రాజీవ్ రహదారిపై ప్రయాణం ఇక భారం కానుంది. బీవోటీ పద్ధతిన నిర్మించు.. నిర్వహించు.. అప్పగించు విధానంలో నిర్మాణం పూర్తయిన ఫోర్‌లేన్ రహదారిపై టోల్‌గేట్ ఫీజు వసూలుకు అంతా సిద్ధమైంది. గాయత్రి ఇంజినీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా కొనసాగుతోన్న పనులు దాదాపు పూర్తయ్యాయి. చెన్నూర్ క్రాస్ రోడ్, జగ్దాల్‌పూర్ హైవే నుంచి శామీర్‌పేట వరకు 207 కిలోమీటర్ల ఈ రహదారి ఉంది.
నిర్మాణం పూర్తి కావడంతో సంబంధిత కాంట్రాక్టర్లు టోల్‌ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు ఆమోదిస్తూ గవర్నర్ నరసింహన్ సంతకం చేశారు. ప్రభుత్వ వాహనాలకు మినహాయింపు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూలై మొదటి వారం నుంచి వసూళ్లు ఆరంభం కానున్నాయి. హైదరాబాద్‌కు సొంత కారులో వెళ్లి వచ్చిన వారు సైతం అదనంగా రూ.300 వరకు టోల్‌ట్యాక్స్ పేరిట జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే.
పస్తుతం ట్యాక్సీ యజమానులు వసూలు చేస్తున్న కిరాయితోపాటు అదనపు భారం పడనుంది. రెండు, మూడు రోజుల్లో టోల్‌టాక్స్ వసూలుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని గాయత్రి సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రతీ 65 కిలోమీటర్లకు ఒక టోల్‌గేట్ చొప్పున నిర్మించాలని నిబంధనలున్నాయి. బసంత్‌నగర్, తిమ్మాపూర్, సిద్దిపేట అవతల దుద్దెడ వద్ద మూడు చోట్ల టోల్‌గేట్లు ఏర్పాటు చేశారు. గోదావరి వంతెన వద్ద నిర్మించాల్సిన టోల్‌గేట్ రామగుండం మండలం బసంత్‌నగర్ వద్ద ఏర్పాటు చేశారు. మిగతా రెండు చోట్ల ఇంతకుముందే భూసేకరణ పూర్తి చేసి గేట్లు నిర్మిస్తున్నారు. గేట్ల వద్ద యంత్రాల బిగింపు కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. గేట్ల నిర్మాణంలో కంప్యూటర్ల ద్వారా ఆన్‌లైన్ విధానంపై అనుసంధానం ప్రక్రియ పూర్తయింది. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వాహనాల్లో ప్రయాణిస్తోన్న ప్రతీ ఒక్కరి ఆచూకీ సీసీ కెమెరాలు పట్టేస్తాయి. సంఘవిద్రోహ శక్తులు, దొంగలు, అనుమానిత వ్యక్తులు ప్రయాణిస్తే వారిని సైతం బంధించే విధంగా ఆధునిక పరికరాలను బిగిస్తున్నారు.
టోల్‌తీస్తారు
Published Thu, May 29 2014 2:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement