గుంటూరులో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు, పక్కన సిబ్బంది, ముసుగులో నిందితులు
గుంటూరు ఈస్ట్: దారి దోపిడీ చేసిన ముగ్గురు వ్యక్తులను, ఒక మైనర్ బాలుడిని లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. లాలాపేట పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ కండే శ్రీనివాసులు, ఎస్‌హెచ్‌వో మురళీకృష్ణ వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ధీరజ్ కుమార్ పటేల్, నటరాజులు నల్లపాడులోని ఓ అట్టల కంపెనీలో టెక్నీషియన్లగా పనిచేస్తున్నారు. గత నెల 19వ తేదీ హైదరాబాద్ వెళ్లి 21న రాత్రి గుంటూరు చేరుకున్నారు.
నల్లపాడు వెళ్లేందుకు రైల్వేస్టేషన్ నుంచి పల్నాడు బస్టాండుకు చేరుకున్నారు. అప్పటికే నలుగురు వ్యక్తులు ఉన్న సర్వీసు ఆటో ఎక్కారు. ఆటో డ్రైవర్ ఆటోను చిలుకలూరిపేట హైవే వైపునకు వేగంగా తీసుకువెళ్లాడు. దీనిపై ప్రశ్నించిన ఇద్దరిని ఆటోలో ఉన్న నలుగురు బెదిరించారు.
సిబ్బందికి అభినందనలు
కేర్ డెంటల్ కళాశాల సమీపంలోని పొలాల్లోకి తీసుకు వెళ్లి ధీరజ్ కుమార్ పటేల్, నటరాజ్‌లపై దాడి చేసి, వారి వద్ద ఉన్న 9 వేల రూపాయల నగదు.,రెండు సెల్‌ఫోన్‌లు లాక్కుని పరారయ్యారు. గాయపడ్డ ఇద్దరు లాలాపేట పోలీసులను ఆశ్రయించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను నియమించి నిందితుల కోసం గాలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నల్లచెరువుకు చెందిన మంచాల శ్రీనివాస్ అలియాస్ వాసు, అడపా బజార్‌కు చెందిన పల్లపు శ్రీకాంత్ అలియాస్ కిట్టు, సుగాలి కాలనీ 4వ లైనుకు చెందిన జఠావత్ శ్రీకాంత్‌నాయక్, మరో మైనర్ బాలుడిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు పురోగతిలో కృషి చేసిన ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ విజయ్‌కుమార్, కానిస్టేబుళ్లు రామారావు, శ్రీనివాసరావు,రాములను డీఎస్పీ, ఎస్‌హెచ్‌వోలు అభినందించారు. నిందితులపై అనుమానిత షీటు తెరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
అదృశ్యమైనవ్యక్తి మృతి
రేమిడిచర్ల(బొల్లాపల్లి): మండలంలోని రేమిడిచర్ల గ్రామంలో 10 రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు. గ్రామానికి చెందిన పవనం వెంకటేశ్వరరెడ్డి(45) 10 రోజుల నుంచి కనిపించకుండాపోయాడు. మద్యానికి బానిసైన వెంకటేశ్వరరెడ్డి తరచూ ఇంటిలో ఎవరికి చెప్పకుండా బంధువుల వద్దకు వెళ్లడం కొంతకాలంగా తిరిగి వస్తుంటాడు. ఈ నేపథ్యంలో 10 రోజులుగా కనిపించకుండాపోయి బొల్లాపల్లి–బండ్లమోటు గ్రామాల మధ్యలోని గాటిమడుగు వద్ద మృత కళేబరంగా గుర్తించారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తిగా పోలీసులు భావించారు. వెంకటేశ్వరరెడ్డి భార్య రుక్మిణి, బంధువులు శవం వద్ద ఉన్న వస్తువుల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించారు. మద్యం అలవాటు ఉన్న ఆయన అతిగా మద్యం సేవించి పడిపోయి ఉండవచ్చునని బంధువులు భావిస్తున్నారు. ఎస్‌ఐ విజయ్ చరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment