సాక్షి, చేబ్రోలు(గుంటూరు) : చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఉన్న సంగం డెయిరీలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని.. అతడు దొంగలించిన రూ. 44.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటనలో దొంగతనం చేసిన వ్యక్తిని చెరుకూరు మండలం కర్నూతల వాసిగా గుర్తించారు.
వడ్లమూడి అడ్డరోడ్డు ప్రాంతంలో ఉన్న సంగం డెయిరీలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిందితుడు డెయిరీ వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి క్యాష్ కౌంటర్ రూం తాళాలు పగలకొట్టి, బీరువాలో ఉన్న నగదును అపహరించుకుపోయాడు. గ్యాస్ కటర్‌ను ఉపయోగించి తాళాలు, ఇనుప బీరువాలో ఉన్న నగదును తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లాలోని పాల సంఘాల నుంచి వచ్చిన నగదు ఆదివారం కావటంతో బ్యాంకులో జమ చేయకపోవటంతో పెద్ద మొత్తంలో నిల్వ ఉంది. రూ.44,43,540 దొంగతనం జరిగినట్లు క్యాషియర్ మన్నెం గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగం డెయిరీలో పూర్తి సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగతనం జరగడం పలు అనుమానాలు రేపింది.
సంగం డెయిరీలో భారీ మొత్తంలో నగదు చోరీకి గురైన విషయం తెలిసిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు, క్లూస్ టీం బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. సీసీఎస్ ఏఎస్‌పీ రాఘవ, డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ ఎ.వి.శివప్రసాద్, సీసీఎస్ డీఎస్పీ కాలేషావలి, గుంటూరు సౌత్ జోన్ డీఎస్‌పీ కె.కమలాకరరావు, చేబ్రోలు సీఐ టి.వి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్ కిషోర్ సీసీ పుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఆచూకీ వివరాలు నమోదైనట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment