
ఆయనకు తగిన గుణపాఠం చెబుతారు
మదనపల్లె: కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా మైనార్టీల ద్రోహి అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బాబ్‌జాన్ ఆరోపించారు. శనివారం ఆయన మదనపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ కదిరి ఎమ్మెల్యే పార్టీ మారడం నీచమైన చర్య అన్నారు. అధికార పార్టీ తాయిలాలకు అశపడి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం, మైనార్టీల మనోభాలను దెబ్బతీసినట్లేనన్నారు. చాంద్‌బాషా రాష్ట్రంలోని మైనార్టీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా షాదీమహళ్లు నిర్మించి, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారన్నారు.
ప్రస్తుతం వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీని స్థాపించి మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. అలాంటి పార్టీని వదిలి వెళ్లడం దారుణమన్నారు. కదిరి నియోజక వర్గ ప్రజలు చాంద్‌బాషాను చూసి ఓట్లు వేయలేదని, జగన్‌మోహన్‌రెడ్డి కోసం, పార్టీపై ప్రేమతో ఆయన్ని గెలిపించారన్నారు. దురాశతో పార్టీ మారిన చాంద్‌బాషాకు మైనార్టీలు రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇలాంటి స్వార్థపరులు ఎంతమంది పార్టీని వదిలినా మైనార్టీలు మాత్రం ఎప్పుడూ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటారని స్పష్టం చేశారు.