సైకిల్‌కు బ్రేకులు | miss leading bicycle distribution in district | Sakshi
Sakshi News home page

సైకిల్‌కు బ్రేకులు

Published Sat, Nov 4 2017 6:56 AM | Last Updated on Sat, Nov 4 2017 6:56 AM

miss leading bicycle distribution in district - Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు సర్కారు అందించిన సైకిళ్లు జిల్లాలో పలుచోట్ల పక్కదారి పట్టాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు బడికొస్తా పథకం పేరుతో వీటి పంపిణీని ప్రారంభించారు. జిల్లాలోని తెలుగుదేశం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కొంత మంది బాలికలకు సైకిళ్లను అందజేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత వీటిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయా రు. ముఖ్యంగా జిల్లాలోని కుప్పం, మదనపల్లి, శాంతిపురం మండలాల పరిధిలోని పాఠశాలల్లో సైకిళ్లు మాయమయ్యాయనే ఆరోపణలు  పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

చిత్తూరు ఎడ్యుకేషన్‌: జిల్లాలోని మొత్తం 547 ఉన్నత పాఠశాలల్లో గత ఏడాది తొమ్మిదవ తరగతి చదువుతున్న 14,423 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా అధికారుల నివేదికల ప్రకారం రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి ఈ ఏడాది మార్చిలో అన్ని మండల కేంద్రాలకు సైకిళ్లు చేరాయి. అధికారులు జూన్‌ నెల నుంచి అరకొరగా  సరఫరా చేసారు. మిగిలిన సైకిళ్లను అలాగే భద్రపరిచామంటూ పలు చోట్ల విక్రయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఎంపిక చేసిన విద్యార్థినులకు బదులుగా అయినవారికి సైకిళ్లను ఇచ్చారని తెలిసిం ది. మొత్తం మీద విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల బడికొస్తా పథకం ఆశయం పూర్తిగా దెబ్బతింది.

ఆర్‌జేడీ హెచ్చరించినా..?
జిల్లాలో బాలికలకు సరఫరా చేసిన సైకిళ్లను, వారి ఫొటోలతో సహా బడికొస్తా యాప్‌లో, సీఎస్‌సీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశిం చారు. ఆ ఆదేశాల ప్రకారం సైకిల్‌ తీసుకొన్న బాలిక ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆన్‌లైన్‌ ప్రక్రియ ఏమాత్రం ముందుకు కదలడం లేదు. గత నెలలో తనిఖీకి వచ్చిన ఆర్‌జేడీ ప్రతాప్‌రెడ్డి త్వరతిగతిన ఫొటోలను అప్‌లోడ్‌ చేయకపోతే సంబంధింత సిబ్బందిని సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. అయినా ఎంఈఓ, డీవైఈఓల్లో ఎలాంటి చలనమూ లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌  చేస్తున్నారు.

ఒక్క ఫొటోనూ అప్‌లోడ్‌ చేయని మండలాలివే..
జిల్లాలో14,423 సైకిళ్లను సరఫరా చేసినట్లు చెబుతుం డగా.. ఇప్పటి వరకు 2,393 సైకిళ్ల ఫొటోలను మాత్రమే  అప్‌లోడ్‌ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క విద్యార్థి ఫొటో కూడా అప్‌లోడ్‌ చేయని మండలాల్లో కుప్పం, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, రేణిగుంట, ఏర్పేడు, విజయపురం, చిన్నగొట్టిగల్లు, రొంపిచెర్ల, నిమ్మనపల్లి, పులిచెర్ల, కార్వేటినగరం, పెనుమూరు, తవణంపల్లి, గుడిపాల, యాదమరి, గంగవరం ఉన్నాయి.

అక్రమాలు రుజువైతే కఠిన చర్యలు
రాష్ట్ర విద్యాశాఖ నిబంధనల ప్రకా రం విద్యార్థినుల ఆధార్‌ లింక్‌ ఆధారంగానే సైకిళ్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన వారికి కాకుండా వేరొకరికి సైకిళ్లను ఇచ్చినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో విద్యార్థుల ఫొటోలను అప్‌లోడ్‌ చేయని వారిపై నివేదిక సిద్ధం చేస్తాం. – పాండురంగస్వామి, డీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement