
కేఆర్ పురం ఐటీడీఏలో పీఓకు వినతిపత్రం ఇస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: వేలేరుపాడు మండలం వసంవవాడకు చెందిన శాఖమూరి సుభాష్ అనే వ్యక్తి త నను పునరావాస కాలనీ నిర్మాణం ఎంపిక జాబితాలో ఎస్టీగా నమోదు చేసి బుట్టాయగూడెం మండలంలో ఇల్లు ఇచ్చారని, తన కుమారుడు సాయికృష్ణను బీసీగా నమోదు చేసి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో ఇల్లు కేటాయిం చారని పొరపాటుగా పడిన పేర్లు వల్ల తన కుటుంబం రెండుగా మారిందని బుధవారం ఐటీడీఏ వద్ద జరిగిన గిరిజన దర్బారులో పీఓ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌కు వినతిపత్రం అందించి గోడు వెళ్లబోసుకున్నాడు. పొరపాటుగా పడిన పేర్లను సరిచేసి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
పోలవరం బీసీ కాలనీ పక్కన డంపింగ్ చేస్తున్నారని, 15 మీటర్లు మాత్రమే డంపింగ్ చేయాలని నిబంధన ఉన్నా 200 మీటర్ల ఎత్తు వేశారని పోలవరానికి చెందిన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి షేక్ ఫాతిమున్నీసా, పార్టీ జిల్లా నాయకులు సీహెచ్ రత్నప్రసాద్ పీఓకు ఫిర్యాదు చేశారు. దీని వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు.
నాన్‌లోకల్‌గా చూపిస్తోంది
నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు సత్తుపల్లిలో డిగ్రీ వరకూ చదువుకున్నాను. రాష్ట్రం విడిపోయాక వేలేరుపాడు మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. మాది వేలేరుపాడు మండలం చెరువుగొల్లగూడెం. ప్రస్తుతం నేను ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే నాన్‌లోకల్‌గా చూపిస్తుంది. మెరిట్‌లిస్ట్‌లో నా పేరు ఆరవది. నన్ను లోకల్‌గా పరిగణిస్తే ఎస్టీ మహిళగా నాకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. అధికారులు ఆ దిశగా నాకు న్యాయం చేయాలి.– ఉయికే మంగ, చెరువుగొల్లగూడెం, వేలేరుపాడు మండలం
ఉద్యోగం కోసం..
ఏఎన్‌ఎం పోస్టుకు ఎంపికైనట్లు జిల్లా కార్యాలయం నుంచి ఉత్తర్వులు వ చ్చాయి. అయితే ఐటీడీఏ నుంచి ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. తాను స్టాఫ్‌నర్స్‌గా ఎంపికైనట్టు జిల్లా నుంచి వచ్చిన ఆర్డర్స్ ఉన్నా ఐటీడీఏ అధికారులు సరైన వివరణ ఇవ్వడం లేదు. నా పోస్ట్ విషయమై అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – పూసం చింతామణి,బూసరాజుపల్లి, బుట్టాయగూడెం మండలం
వినతులు ఇలా..
♦ ముంపు మండలాలను ఖాళీ చేస్తామంటున్న అధికారులు ముందుగా బిల్లులు చెల్లించాలని పలువురు గిరిజనులు పీఓను కోరారు.
♦ కొయిదా గ్రామానికి చెందిన ముచ్చిక రమేష్ పీహెచ్‌సీలో అటెండర్‌గా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
♦ శాఖమూరి వంశీకృష్ణ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం వినతిపత్రం సమర్పించారు.
♦ కుక్కునూరుకు చెందిన సనిపల్లి వేణుబాబు ఆర్ అండ్ ఆర్‌లో భూమి వివరాలు నమోదు చేసి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చారు.
♦ జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన గుర్రాల వెంకటేశ్వరరావు భూమికి పరిహారం ఇవ్వకుండా నిలుపుదల చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.
♦ కుక్కునూరు మండలం వెంకటాపురానికి చెందిన రేగలగడ్డ చిన్న వెంకటేశ్వర్లు నష్టపరిహారం కోసం దరఖాస్తు సమర్పించారు.
♦ వీరితోపాటు సుమారు 70 దరఖాస్తులను వివిధ సమస్యలపై వినతి పత్రాలను గిరిజనులు పీఓకు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment