మహిళా కార్మికుల్ని దూషించిన టీడీపీ ఎమ్మెల్యే
ఏలూరు (పశ్చిమగోదావరి జిల్లా) : ఏలూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మునిసిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి), నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కో-ఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు ఆధ్వర్యంలో తాత్కాలిక సిబ్బందితో చెత్త తొలగించే ప్రయత్నం చేయడంతో కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే బుజ్జి మహిళా కార్మికులను అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జోసెఫ్ తంబి, కారు దుర్గారావు, ప్రసాద్ అనే కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు, ఉద్యోగులు, నాయకులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఏమిటని ఏఐటీయూసీ నాయకుడు కె.కృష్ణమాచార్యులు, సీఐటీయూ నాయకులు బి.సోమయ్య ప్రశ్నించారు.