
అరగుండు గీయించుకున్న ఎమ్మెల్యే టీవీ రామారావు
పశ్చిమ గోదావరి జిల్లాలో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. కొవ్వూరు బస్టాండు నుంచి రోడ్-కమ్ రైల్వే బ్రిడ్జి వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్-కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద అఖిలపక్షం మహా ధర్నా కూడా చేశారు. దీనికి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ర్యాలీలో ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు, వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ కొయ్యె మోషన్ రాజు, ఎమ్ఎస్ఓ మైపాల రాంబాబు, యువరాజు కేబుల్ అధినేత దుడ్డుపూడి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే టీవీ రామారావు అరగుండు గీయించుకున్నారు.
సమైక్యాంధ్ర ప్రకటించకుంటే కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్ఎస్ఓ మైపాల రాంబాబు, యువరాజు కేబుల్ అధినేత దుడ్డుపూడి రామచంద్రరావు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన ప్రకటన చేశారని కృష్ణబాబు, కొయ్యె మోషన్ రాజు విమర్శించారు. విభజన ఖాయమంటూ దిగ్విజయ్ చెబుతున్నా కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆంటోనీ కమిటీ ఢిల్లీలో కూర్చొని అభిప్రాయాలు సేకరించడం కాదని, సీమాంధ్ర ప్రాంతానికి వచ్చి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండు చేశారు. ప్రజలకు న్యాయం జరిగేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కృష్ణబాబు, కొయ్యె మోషన్ రాజు తెలిపారు.