సాలూరు: ఎస్టీ జాబితాలో బోయలను చేర్చాలని నిర్ణయించిన టీడీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్న టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గిరిజనులు, గిరిజన సంఘాలు అడుగడుగునా నిలదీయాలని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర కోరారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా లేని సమస్యను మన రాష్ట్రంలో ప్రభుత్వం కోరి తెచ్చి పెడుతోందన్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ ప్రజా పోరాటంతోపాటు న్యాయపోరాటం చేస్తున్నారన్నారు. గిరిజనులు నిరక్షరాస్యులు, పేదవాళ్లు, అమాయకులు కావడంతో ఆ స్థాయిలో పోరాటం చేయడం లేదన్నారు.
కానీ గిరిజనులు ఆ స్థాయిలో పోరాడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాదేనని సూచించారు. బోయ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోడానికి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు క్యాబినెట్ ఆమోదంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేయడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం ఎస్టీల జనాభా 26 లక్షలుంటే బోయ కులస్తుల జనాభా 30 లక్షలకు పైగా ఉందన్నారు. మైదాన ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం ఎస్టీ కులంపై సామాజిక దాడి చేయించడమేన్నారు. వారిపై నిజంగా ప్రేమే ఉంటే ఓబీసీ, ఈబీసీ జాబితాలో చేర్చుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
జనరల్ సీట్లలో పోటీ చేశారా..
రాష్ట్రంలో ఒక్క జనరల్ సీట్లోనైనా పోటీ చేసి గెలిచిన గిరిజనుడున్నాడా? అని రాజన్నదొర ప్రశ్నించారు. బోయ కులస్తులు మాత్రం జనరల్ సీట్లలో పోటీచేసి, గెలుపొందారని, దానికి నిదర్శనం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన కాల్వ శ్రీనివాసులేనని గుర్తు చేశారు. అగ్రవర్ణాలతో పోటీ పడుతున్న కులాన్ని అన్ని విధాలుగా వెనుకబడ్డ గిరిజనుల్లో చేర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేని సమయంలో ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. ఆ సమయంలో సభలోని టీడీపీ ఎమ్మెల్యేలు, శాసనమండలిలో ఎమ్మెల్సీలు కనీసం అభ్యంతరం కూడా తెలపకుండా ద్రోహం చేశారన్నారు. అందుకే గ్రామాలకు వచ్చే టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నిలదీయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment