♦ టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
♦ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర
సాలూరు: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి గిరిజనులన్నా, గిరిజన ప్రజాప్రతినిధులన్నా చిన్నచూపని, అందుకే అడుగడుగునా అవమానపరుస్తూ, అన్యాయం చేస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఆరోపించారు. మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను సీనియర్ అధికారులతో గాని, స్థానిక అధికారులతో గాని ఆహ్వానించాల్సి ఉందన్నారు. అయితే గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ కార్యక్రమానికి జిల్లాలో ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
గిరిజన ప్రజాప్రతినిధులను గౌరవించలేని ప్రభుత్వం గిరిజనులను ఉద్దరిస్తుందా..? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు పాచిపెంట మండలంలో తమ కుటుంబీకులకున్న భూములను ఉచితంగా ఇస్తామంటే కాదని, కొత్తవలస మండలంలో గిరిజనులు ముప్‌పై, నలబై ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని నిర్మాణ పనులు చేపట్టడం తగదన్నారు. ఆయా భూములపై పూర్తి హక్కు కలిగిన గిరిజన రైతులకు పరిహారం ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తోందన్నారు.
కేంద్రమంత్రి అశోక్ ఇస్తామన్న భూములు విమానాశ్రయానికి దూరంగా ఉండడం వల్లే గిరిజన విశ్వవిద్యాలయానికి తీసుకోలేదని ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవం కాదన్నారు. అలాంటప్పుడు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ విమానాశ్రమానికి ఎంతదూరంలో ఉందో ప్రభుత్వమే చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాకంఠక పాలన సాగిస్తున్న టీడీపీకి ప్రజల బుద్ధి చెబుతారన్నారు.
గిరిజనులంటే చిన్నచూపు....
Published Mon, Aug 21 2017 2:10 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Advertisement