నిశిరాత్రి ఘోరం
Published Fri, Dec 13 2013 3:45 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
పాలకొండ, న్యూస్‌లైన్: నిశిరాత్రి ఘోరం జరిగిపోయింది. వేగంగా ఇంటికి చేరుకోవాలన్న ఆతృత ఆ యువకుడి నిండు ప్రాణాన్ని బలికొంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్పోర్ట్స్ బైక్ యమపాశమైంది. ఫలితంగా తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పాలకొండ పోలీస్‌స్టేషన్ ఎదుట జరి గిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవు లు ఏకైక తనయుడు శ్రీను(22) ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం రాత్రి వీరఘట్టం మండలం మొఖాస రాజపురంలో బంధువుల వివాహానికి హాజరైన శ్రీను రాత్రి 2 గంటల సమయంలో యమహా స్పోర్ట్స్ బైక్‌పై ఒంటరిగా బయలుదేరాడు.
మరికొద్ది నిముషాల్లో పాలకొండలోని నివాసానికి చేరుకోవాల్సి ఉండగా పోలీస్‌స్టేషన్ ఎదుట ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో బైక్ ముందుభాగం తునాతునకలైంది. తల, ఛాతిపై తీవ్ర గాయాలవడంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న ఎమ్మెల్యే సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించారు. షాక్‌కు గురైన ఆయనను సహచర నేతలు ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సీతంపేట ఏజెన్సీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు పెద్దఎత్తున రాజకీయ నాయకులు, ప్రజలు తరలివచ్చారు.
ప్రమాదంపై గందరగోళం
ప్రమాదంపై తొలుత గందరగోళం నెల కొంది. ఘటనలో ఎమ్మెల్యే తనయుడు చనిపోయినట్టు తొలుత ఎవరికీ సమాచారం లేదు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఎమ్మెల్యే సన్నిహితులు కొందరు చూసి షాక్‌కు గురయ్యారు. తొలుత ఏదో భారీ వాహనం బలంగా ఢీకొనటంతో మృతి చెంది ఉంటాడని భావించారు. కొద్ది గంటల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్డీవో కార్యాలయం సమీపంలో నివాసముంటున్న ఓ వ్యక్తి ఎడ్లబండితో వస్తుండగా శ్రీను బైక్ బలం గా ఢీకొన్నట్టు తేలింది. ఈ ఘటనలో ఎద్దు కొమ్ము విరిగిపోయింది. కొమ్ము తో పాటు నాటుబండికి ఉన్న పూజ శ్రీను శరీరాన్ని బలంగా తాకినట్టు ఆనవాళ్లున్నాయి.
డీఎస్పీ శాంతో, సీఐ విజయానంద్, ఎస్సై వినోద్‌బాబు సంఘటనపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న శ్రీను అక్క, బావ బెంగ ళూరు నుంచి హుటాహుటిన వచ్చారు. పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్న ప్రజలు, ఎమ్మెల్యే సన్నిహితులు, సహచర కాం గ్రెస్ నాయకులు కంటతడి పెట్టారు. పోస్టుమార్టం అనంతరం శ్రీను మృతదేహాన్ని సీతంపేటలోని ఇంటికి తరలించారు. సుగ్రీవులు అత్తవారి గ్రామమైన కారిగూడలో అంత్యక్రియలు నిర్వహించారు. బైక్ ఢీకొన్న ఎడ్ల బండి యజమాని పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వినోద్‌బాబు తెలిపారు.
స్కార్పియో వాహనంలో
రమ్మన్నా రాలేదు..
ఏకైక కుమారుడి ఆకస్మిక మరణంతో ఎమ్మెల్యే సుగ్రీవులు, ఆయన సతీమణి భాగ్యలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గుండెలవిసేలా రోదించారు. వాస్తవానికి, ఎం.రాజపురంలో వివాహానికి తల్లి భాగ్యలక్ష్మి కూడా హాజరయ్యారు. పెళ్లి ముగిసాక తనతోపాటు స్కార్పియో వాహనంలో రమ్మని కుమారుడిని కోరారు. చలికాలం రాత్రి సమయంలో బైక్‌పై ప్రయాణం మంచిది కాదని కూడా చెప్పారు. మీరు వెళ్లండి.. తర్వాత వస్తానని శ్రీను చెప్పడంతో చేసేదిలేక భాగ్యలక్ష్మి ఒక్కరే పాలకొండ వచ్చేశారు. ఉదయం వరకు వీరఘట్టంలోగాని, వండువ గ్రామంలోగాని విశ్రాంతి తీసుకొని వెళతానని తన స్నేహితులకు చెప్పిన శ్రీను అర్ధరాత్రి 2 గంటల సమయంలోనే ఒంటరిగా బయలుదేరి ప్రమాదంలో అసువులు బాశాడు. అతడు హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్(ట్రిపుల్ ఈ) చదువుతూ మధ్యలో ఆపేశాడు. యమహా స్పోర్ట్స్ బైక్‌ను పంతం పట్టి మరీ కొనిపించుకున్నాడని, స్పోర్ట్స్ బైక్ వద్దని తండ్రి నచ్చజెప్పినా వినిపించుకోలేదని సన్నిహితులు చెప్పారు. ఇటీవలే శ్రీను అయ్యప్పమాల ధరించి శబరిమలై వెళ్లి నాలుగు రోజుల క్రితమే స్వస్థలం చేరుకున్నాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది.
తీరని దుఃఖంలోనూ
నేత్రదానానికి అంగీకారం
తీరని దుఃఖంలో ఉన్నప్పటికీ, మరణించిన కుమారుడి నేత్రాలను దానం చేసేందుకు ఎమ్మెల్యే సుగ్రీవులు దంపతులు అంగీకరించారు. ఈ మేరకు ఆయన సన్నిహితులు సమాచారం అందించటంతో శ్రీకాకుళం రెడ్‌క్రాస్ సొసైటీ సిబ్బంది వచ్చి నేత్రాలను సేకరించి ఐ బ్యాంక్‌కు తరలించారు.
సీఎంతో సహా పలువురి సంతాపం
ఎమ్మెల్యే సుగ్రీవులును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర క్యాబినెట్ మంత్రి వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, పసుపులేటి బాలరాజు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సమచర ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు.
Advertisement