బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. మరో కొద్దిరోజుల్లో ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నిల కమిషన్ వేగవంతం చేసింది. పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లను అందుబాటులో ఉంచడంతోపాటు, ఇప్పటికే ఓటు హక్కు ఉన్న వారు జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలని సూచిస్తూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాల్లో అర్హత ఉన్నవారు ఓటర్లుగా పేర్లు సవరించుకునేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్ లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో కొత్తవి నమోదు, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని ఎన్నికల సంఘం చెపుతుంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం గతానికి భిన్నంతగా వెబ్‌సైట్లు, యాప్‌లను రూపొందించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ తాజాగా ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లో ఓటరు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న వారు దీన్ని డౌన్ లోడ్ చేసుకుని సేవలు పొందవచ్చు.
అందుబాటులో సమగ్ర సమాచారం
ఈ నూతన యాప్‌లో ఎన్నిలక ప్రక్రియకు సంబంధించిన సమగ్ర పమాచారాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ యాప్‌లో పొందుపర్చింది. ఓటు నమోదు నుంచి ఎన్నికల అనంతరం ఫలితాలు వరకూ అన్ని ఈ యాప్‌లో చూసుకునేలా ఈ యాప్ రూపొందించారు. మీ ఓటు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు. ఓటు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఫారాలు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు, పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, ఎన్నికల నిర్వహణ సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు వంటి తదితర పూర్తి సమాచారం ఈ యాప్ నుంచి పొందవచ్చు.
యాప్‌లో సేవలు ఇలా
♦ ఈ యాప్ ద్వారా మీ ఓటు వివరాలు నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఎపిక్ నంబరు ఉంటే దాన్ని యాప్‌లో నమోదు చేసి మీ ఓటు వివరాలు కనిపిస్తాయి.
♦ ఎపిక్ నంబరు లేని పక్షంలో ఓటరు పేరు, తండ్రిపేరు, రాష్ట్రం, నియోజకవర్గం నమోదు చేస్తే సంబంధిత ఓటు వివరాలు కనిపిస్తాయి.
♦ ఓటరు సర్వీస్ ట్యాగ్ ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చు, ఓటు బదిలీ చేసుకోవచ్చు. తొలగించమని అభ్యర్థించవచ్చు, ఓటరు గుర్తింపు కార్డులోని తప్పులు సరిదిద్దుకోవచ్చు, నియోజకవర్గం పరిధిలో ఓటు బదిలీ చేసుకోవచ్చు.
♦ దీనికోసం ఓటు నమోదుకు ఫారం–6, తొలగింపునకు ఫారం–7, చేర్పులు, మార్పులకు ఫారం–8. బదిలీకి ఫారం 8ఏ యాప్‌లోనే వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది.
♦ ఏదైనా సమస్య ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన లేదా మీ ఓటు తొలగించినా ఈ యాప్ ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం మీ మొబైల్ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది.
♦ ఈవీఎం ట్యాగ్ క్లిక్ చేయడం ద్వారా ఈవీఎం యత్రాలు ఏవిధంగా పనిచేస్తాయో అవగాహన కల్పించడం, ఈవీఎం సహాయంతో వేసిన ఓటును పరిశీలించుకునే వీవీప్యాట్ ఏవిధంగా పనిచేస్తుందో వంటి సమాచారం వీడియోల రూపంలో పొందుపర్చారు.
♦ ఎలక్షన్ ట్యాగ్ క్లిక్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహించనున్న ఎన్నికల వివరాలు, వచ్చే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు. ఎన్నికల్లో పో టీ చేయడానికి ఉన్న అర్హతలను తెలుసుకునే అవకాశం, గతంలో జరిగిన జనరల్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు, బైఎలక్షన్స్ డేటాను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఎన్నికల ఫలితాలను ఇంట్లోనే కూర్చునే ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 1955 నుంచి 2014 ఎ న్నికల ఫలితాలు బుక్‌లెట్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
♦ ఎన్నికల కమిషన్ తీసుకునే ఏదైనా కొత్త నిర్ణయం, సర్కులర్లు, పత్రికా ప్రకటనలను ఎప్పటికప్పుడు చూడవచ్చు.
యాప్ చాలా ఉపయోగకరం
18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకూ ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తున్నాం. అప్పటివరకు ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రూపొందించిన ఈ ఓటరు హెల్ప్‌లైన్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఎన్నికల అక్షరాస్యత సాధించేందుకు ఈ కొత్త యాప్ చాలా ఉపయోగపడుతుంది.– సృజన, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment