శామీర్‌పేట్, న్యూస్‌లైన్: మూట్ కోర్టు కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో వాదనా పటిమ పెరుగుతుందని నల్సార్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫా అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ నల్సార్ లా యూనివర్సిటీలో మూడు రోజులుగా బీఏ ఎల్‌ఎల్‌బీ విద్యార్థులకు నిర్వహిస్తున్న జస్టిస్ బోధ్‌రాజ్ సహానీ మెమోరియల్ 7వ వార్షిక ‘మూట్ కోర్టు కాంపిటీషన్-2013’ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ కాంపిటేషన్‌లో భారత రాజ్యాంగానికి సంబంధించిన సమస్యలపై చర్చ జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్సార్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తాఫా హాజరై విజేతలకు మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు న్యాయశాస్త్రంలో నూతన అధ్యయనానికి దారులు వెతకాలని సూచించారు. పోటీలో గెలిచిన వారు మరో మెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాలని, ఓడిన వారు గెలిచేందుకు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని అన్నారు. గెలుపోటములు సహజమని, ప్రతి విద్యార్థి పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ మూట్ కోర్టు కాంపిటీషన్ వేదిక అని అన్నారు.
వివిధ దశల్లో పోటీలు
నల్సార్ లా యూనివర్సిటీ, జస్టిస్ బోధ్‌రాజ్ సహానీ మెమోరియల్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన ‘మూట్ కోర్టు కాంపిటీషన్-2013’ పోటీలకు దేశంలోని 48 బెస్ట్ లా యూనివర్సిటీలను ఎంచుకున్నారు. అయితే వాటిలో 24టీంలు మూట్ కోర్టు పోటీలో పాల్గొన్నాయి. ఒక్కో టీంకు అరగంట చొప్పున వాదనలు వినిపించడానికి వీలు కల్పించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ దశల్లో పోటీలు నిర్వహించి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సెమీ ఫైనర్, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫైనల్స్ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంమనోహర్ లోహియ నేషనల్ హై యూనివర్సిటీ లక్నో (ఆర్‌ఎంఎన్‌ఎల్‌యూ) జట్టుకు, కలకత్తాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జుడీషియల్ సెన్సైస్ వెస్ట్ బెంగాల్ టీంల మధ్య ఫైనల్ పోటీ జరిగింది.
ఈ జట్లు ‘143వ అధికరణ కింద భారత రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఇచ్చే సలహాలు’ అనే అంశంపై చర్చించాయి. ఒక్కో జట్టు 35 నిమిషాలపాటు తన వాదనను విన్పించింది. చివరకు స్వల్ప పాయింట్ల తేడాతో రాంమనోహర్ లోహియ నేషనల్ హై యూనివర్సిటీ టీం విజేతగా నిలిచింది. విజేతలకు నల్సార్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ విజేంద్ర కుమార్, విధులతలు మెమోంటోలతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. నల్సార్ లా యూనివర్సిటీ నిర్వహించిన మూట్ కోర్టు పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్‌రావు, ప్రస్తుత న్యాయమూర్తులు జస్టిస్ నూతి రాంమ్మోహన్‌రావు, జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్‌కార్‌లు వ్యవహరించారు.
పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
Published Mon, Oct 7 2013 2:23 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement