జీఎస్టీ పరిధిలోకి మరింత మంది! | more peoples will come under gst | Sakshi
Sakshi News home page

జీఎస్టీ పరిధిలోకి మరింత మంది!

Published Thu, Dec 14 2017 3:37 AM | Last Updated on Thu, Dec 14 2017 3:37 AM

more peoples will come under gst - Sakshi

సాక్షి, అమరావతి: జీఎస్‌టీ పన్ను పరిధిలోకి మరింత మందిని తీసుకురావడానికి గల మార్గాలను అన్వేషించడానికి రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కూడిన ఎంపవర్డ్‌ కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశం కానుంది. గత రెండు నెలలుగా జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య తగ్గిపోతుండటం, ఆ మేరకు ఆదాయమూ క్షీణిస్తుండడంతో కేంద్రం ఆందోళన చెందుతోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న లిక్కర్, పెట్రోలియం, స్టాంప్‌ డ్యూటీలు వంటి వాటిని కూడా జీఎస్‌టీలోకి తీసుకొచ్చేందుకున్న సాధ్యాసాధ్యాల బాధ్యతను ఎంపవర్డ్‌ కమిటీకి అప్పచెప్పింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరగనున్న కమిటీ సమావేశం.. లిక్కర్, పెట్రోలియం, స్టాంప్‌ డ్యూటీలు వంటి వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడంపై వివిధ రాష్ట్రాలకున్న అభ్యంతరాలను ప్రధానంగా చర్చించడంతోపాటు జీఎస్‌టీ పన్ను చెల్లింపుదారుల్ని ఎలా పెంచాలన్న విషయంపైనా దృష్టి పెట్టనుంది. ఈ కమిటీ ఇచ్చే సూచనలపై వచ్చే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పెట్రోలు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఇందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదని సమాచారం. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ను ప్రత్యేక దృష్టితో పరిశీలించి జీఎస్‌టీ పరిధి నుంచి తప్పించాలని ఈ సమావేశంలో ఏపీ డిమాండ్‌ చేయనుందని తెలుస్తోంది.

ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి..
జీఎస్‌టీ ఆదాయం తగ్గితే ఆ మేరకు కేంద్రం పరిహారం ఇస్తున్నా... కాంపెన్సేషన్‌ సెస్‌ పేరుతో ఆ భారం తిరిగి రాష్ట్రాలపైనే పడుతుండటంతో సొంతంగా ఆదాయం పెంచుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ పరిధిలోకి మరింతమందిని తీసుకురావడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,48,461 మంది జీఎస్‌టీ కింద నమోదవగా క్రమంగా రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. జూలై నెలలో రిటర్నులు దాఖలు చేసినవారి శాతం 88.84 ఉండగా, అది క్రమంగా క్షీణిస్తూ అక్టోబర్‌ నాటికి 69.69 శాతానికి పడిపోయింది. దీంతో రాష్ట్రంలో జీఎస్‌టీ కింద నమోదు చేసుకోకుండా జీరో వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా సేవారంగంపై కన్నేయాలని వాణిజ్య పన్నులశాఖ నిర్ణయించింది. జనవరి నుంచి ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ శాఖకు చెందిన కీలక అధికారి ఒకరు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement