రూ.50 కోట్ల పనికి రూ. 160 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా రూ.50 కోట్లతో పూర్తయ్యే పనికి రూ.160 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థను కాంట్రాక్టు మేరకు పని చేయించేలా చూడటంలో విఫలమైన అధికారులు అనాలోచితంగా తొలుత ఆ సంస్థను తొలగించి.. తాజాగా మళ్లీ అదే సంస్థకు ఎక్కువ మొత్తానికి కాంట్రాక్టు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని హై పవర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. విజయనగరం జిల్లా కోటగండ్రెడు వద్ద చంపావతి నదిపై తారకరామతీర్థ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.
4.28 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 25 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనేది లక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా నదిపై బ్యారేజీ, డైవర్షన్ కెనాల్, రిజర్వాయర్, కాల్వల నిర్మాణాలను చేపట్టారు. మొత్తం రూ.181 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేయడానికి సీఆర్18జీ- బీఎస్‌సీపీఎల్ (శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్) ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రూ.47 కోట్ల విలువైన పనుల్ని చేసింది. ఇందులో 84 శాతం బ్యారేజీ పనులు కాగా, 42 శాతం డైవర్షన్ కాల్వ పనులు, 11 శాతం రిజర్వాయర్ పనులు ఉన్నాయి. రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు రూ.50 కోట్ల వ్యయాన్ని మొదట అంచనా వేశారు.
రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ ఆ ప్రాంతంలోని భూ అంతర్భాగంలో ప్రత్యేక పరిస్థితిని సాకుగా చూపుతూ రిజర్వాయర్ నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని పేర్కొంటూ పనుల్ని నిలిపివేశారు. దీంతో మిగతా పనులు చివరి దశకు చేరుకుంటున్నా...రిజర్వాయర్ పనులు మాత్రం ముందుకు కదల్లేదు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పనులు చేయించాల్సిన అధికారులు రిజర్వాయర్ సంబంధిత కాంట్రాక్టు (రూ.50 కోట్లు) రద్దు చేసి దాని నిమిత్తం కొత్తగా టెండర్‌ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయం (రూ.160 కోట్లు) భారీగా పెరిగింది. ఈ టెండర్‌లో మళ్లీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌తో పాటు మూడు సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో ఒక సంస్థ సాంకేతిక అర్హతను సాధించలేదు. శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ ఎల్-1గా, సూ సంస్థ ఎల్-2గా నిలిచాయి. దాంతో ఈ టెండర్‌ను శ్రీనివాస సంస్థకు అప్పగిస్తూ మంగళవారం హై పవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అధ్యక్షతన గల ఈ కమిటీలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భాస్కర్, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ తదితరులు ఉన్నారు. విశేషమేమిటంటే మరో రూ.50 కోట్లు అదనంగా చెల్లిస్తే రిజర్వాయర్ పనులు పూర్తి చేసేస్తామని శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ గతంలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ప్రభుత్వం కొత్తగా టెండర్లకు వెళ్లింది. ఏకంగా రూ. 160 కోట్లను చెల్లించేందుకు సిద్ధమైంది.