ముఖ్యమైన పదవుల్లో జిల్లా నాయకులు
జోడు పదవులతో కొందరిలో జోష్
విజయవాడ : టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల కూర్పులో పదువుల్లో ఉన్నోళ్లకే మళ్లీ పట్టం కట్టారు. జిల్లా నేతలకు జాతీయస్థాయిలో కీలక పదవులు ఇచ్చినా ఎంతోకాలంగా పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్లకు అవకాశం కల్పించలేదనే అసంతృప్తి వ్యక్తమైంది. జిల్లా నుంచి 13 మందికి కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో పదవులు దక్కాయి. వారిలో ఎక్కువ మంది ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. వారికే కమిటీల్లోనూ అవకాశం కల్పించడంపై తెలుగుతమ్ముళ్లలో అసహనం వ్యక్తమవుతోంది. ఒకరిద్దరు ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడం తప్పులేదని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకే తిరిగి పార్టీ పదవులను కట్టబెట్టడంతో పార్టీలో పనిచేస్తున్న సీనియర్లకు తగిన గుర్తింపు రావడం లేదనే విమర్శలు వినిపించాయి. జిల్లాకు చెందిన నందమూరి హరికృష్ణను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి (వై.వి.ఎస్.చౌదరి)ని ఎక్స్‌అఫిషియో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్‌ను కేంద్ర కమిటీలో ఆఫీస్ కోఆర్డినేషన్ సెక్రట రీగా, ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావును కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా నియమిం చారు. రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా వర్ల రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పంచుమర్తి అనూరాధ, వై.వి.బి. రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చలమలశెట్టి రామాంజనేయులు, బొద్దులూరి రామాంజనేయులు, కిలారు రాజేష్, కార్యదర్శులుగా గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, కోమటి సుధాకర్‌ను నియమించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనకళ్ల
కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురికి స్థానం కల్పించారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, తెలంగాణ నుంచి రావూరి ప్రకాష్‌రెడ్డికి అవకాశం లభించింది. ఈ రెండు రాష్ట్రాలను కలుపుతూ నారా లోకేష్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు.
నోరున్నోళ్లకే పదవులు
వివిధ టీవీ చానళ్లలో జరిగే చర్చల్లో పాల్గొని నోరేసుకుని మాట్లాడేవారికే పార్టీ పదవులను కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. వై.వి.బి.రాజేంద్రప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనూరాధ, వర్ల రామయ్య తరచుగా టీవీల్లో కనపడి పెద్దల కనుసన్నల్లో పడ్డారని అంటున్నారు. బొండా, వైవీబీకి ఇప్పటికే పదవులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ఇచ్చిన హామీలు మరచి...
గతంలో అర్బన్ కమిటీ వేస్తున్నప్పుడు మంత్రి దేవినేని ఉమా వర్గానికి చెందిన గన్నే నారాయణ ప్రసాద్ (అన్నా)కు నగర కార్యదర్శి ఇచ్చేందుకు ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వర్గానికి చెందిన కె.పట్టాభిరామ్‌కు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆయనకు రాష్ట్ర కమిటీలో పదవి దక్కలేదు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూశారని విమర్శ వస్తోంది. గతంలో నగర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ముష్టిశ్రీనివాస్‌కు ఇప్పుడు స్థానం కల్పించలేదు. కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు, తూమాటి ప్రేమనాథ్ వంటి సీనియర్లను పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇదేం జాతీయ కమిటీ?
టీడీపీ జాతీయ కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతలకే అవకాశం కల్పించారు. ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ వంటి రాష్ట్రాల్లోనూ తెలుగువారున్నారు. వారికి అవకాశం కల్పించకపోవడంతో ఇదేం జాతీయ కమిటీ అన్న విమర్శలు వస్తున్నాయి.
పదవులు ఉన్నోళ్లకే పట్టం
Published Thu, Oct 1 2015 1:05 AM | Last Updated on Wed, Aug 29 2018 12:56 PM
Advertisement
Advertisement