Nationally
-
శభాష్ ఏపీ.. ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఆర్థిక, సామాజిక రంగాలపై తీవ్ర ప్రతికూలత చూపిన కరోనాకు ఎదురొడ్డి ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధిని సాధించిందని ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ – 2021’వెల్లడించింది. ఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’విడుదల చేసిన ఆ నివేదిక కరోనాను ఎదుర్కోవడంలో పలు రాష్ట్రాల పనితీరును విశ్లేషించింది. దేశవ్యాప్తంగా అభివృద్ధి గమనం మందగించినా ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాలు ఉత్తమ పనితీరు కనబరిచాయని, 2020లో సుస్థిర అభివృద్ధి సాధించిన రాష్ట్రాల్లో ఏపీ మూడో ర్యాంకు సాధించిందని నివేదిక వెల్లడించింది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై సామాజిక స్థితిగతులు, పిల్లల ఆరోగ్యం, పర్యావరణ కాలుష్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపించిందని పేర్కొంది. భారత్ ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉందని పేర్కొనడం గమనార్హం. సుస్థిర అభివృద్ధి రేటులో ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో భారత్‌కు 117 ర్యాంకు ఇవ్వడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అయినప్పటికీ దేశంలో రాష్ట్రాలవారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌తోసహా ఐదు రాష్ట్రాలు ఉత్తమ పనితీరు కనబరిచాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. నివేదికలో ప్రధాన అంశాలు ఇవీ... ప్రతికూలతలోనూ ఉత్తమ పనితీరు.. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఆరి్థక, సామాజిక రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. అభివృద్ధి మందగించింది. అయినప్పటికీ దేశంలో ఐదు రాష్ట్రాలు ఉత్తమ పనితీరు కనబరిచాయి. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొని మరీ సుస్థిర అభివృద్ధిని సాధించాయి. వాటిలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. కేరళ మొదటిస్థానం సాధించగా హిమాచల్‌ప్రదేశ్ రెండో స్థానం, నాలుగో స్థానంలో తమిళనాడు, ఐదో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. కరోనా వేళ సుస్థిర అభివృద్ధి సాధనలో బిహార్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, యూపీ చివరి స్థానాల్లో ఉన్నాయి. నిర్మాణాత్మక చర్యలు చేపట్టిన ఏపీ కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టిందని ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎని్వరాన్మెంటల్ రిపోర్ట్–2021’ప్రశంసించింది. వైద్య, ఆరోగ్య రంగాల సేవలను విస్తృతం, బలోపేతం చేయడంతోపాటు పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని పేర్కొంది. ►రాష్ట్రంలో 1.47 కోట్లమంది పేదలకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ►2020 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నెలకు రెండుసార్లు చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టారు. కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున నెలకు రెండుసార్లు అంటే నెలకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. ఇలా మొత్తం మీద 35.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసి పేదలను ఆదుకుంది. ►వైద్య, ఆరోగ్య సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృతం చేసింది. వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి దాదాపు రూ.1,400 కోట్లు వెచ్చించింది. అందులో ల్యాబొరేటరీల ఏర్పాటుకే రూ.40 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ►దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కోవిడ్‌ను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది. ►2020 మార్చి నాటికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబరేటరీ కూడా లేకున్నా యుద్ధ ప్రాతిపదికన ఏకంగా 14 వైరాలజీ ల్యా»ొరేటరీలను ఏర్పాటు చేసింది. ►రాష్ట్రంలో కొత్తగా దాదాపు 10 వేలమంది వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించింది. ►కొత్తగా 300 108 అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 108 అంబులెన్స్‌లు 730కి చేరుకున్నాయి. ►రాష్ట్రంలో 104 వైద్య సేవల కోసం కొత్తగా 675 వాహనాలను ప్రవేశపెట్టింది. ►రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు సత్ఫలితాలను అందించాయి. 2020 అక్టోబరు ప్రారంభం నాటికి కరోనా ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి ఉపాధి అవకాశాలు పెరిగాయి. చదవండి: కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా! బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! -
పదవులు ఉన్నోళ్లకే పట్టం
ముఖ్యమైన పదవుల్లో జిల్లా నాయకులు జోడు పదవులతో కొందరిలో జోష్ విజయవాడ : టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల కూర్పులో పదువుల్లో ఉన్నోళ్లకే మళ్లీ పట్టం కట్టారు. జిల్లా నేతలకు జాతీయస్థాయిలో కీలక పదవులు ఇచ్చినా ఎంతోకాలంగా పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్లకు అవకాశం కల్పించలేదనే అసంతృప్తి వ్యక్తమైంది. జిల్లా నుంచి 13 మందికి కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో పదవులు దక్కాయి. వారిలో ఎక్కువ మంది ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారు. వారికే కమిటీల్లోనూ అవకాశం కల్పించడంపై తెలుగుతమ్ముళ్లలో అసహనం వ్యక్తమవుతోంది. ఒకరిద్దరు ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడం తప్పులేదని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకే తిరిగి పార్టీ పదవులను కట్టబెట్టడంతో పార్టీలో పనిచేస్తున్న సీనియర్లకు తగిన గుర్తింపు రావడం లేదనే విమర్శలు వినిపించాయి. జిల్లాకు చెందిన నందమూరి హరికృష్ణను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి (వై.వి.ఎస్.చౌదరి)ని ఎక్స్అఫిషియో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్‌ను కేంద్ర కమిటీలో ఆఫీస్ కోఆర్డినేషన్ సెక్రట రీగా, ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావును కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా నియమిం చారు. రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా వర్ల రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పంచుమర్తి అనూరాధ, వై.వి.బి. రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చలమలశెట్టి రామాంజనేయులు, బొద్దులూరి రామాంజనేయులు, కిలారు రాజేష్, కార్యదర్శులుగా గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, కోమటి సుధాకర్‌ను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనకళ్ల కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురికి స్థానం కల్పించారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, తెలంగాణ నుంచి రావూరి ప్రకాష్‌రెడ్డికి అవకాశం లభించింది. ఈ రెండు రాష్ట్రాలను కలుపుతూ నారా లోకేష్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. నోరున్నోళ్లకే పదవులు వివిధ టీవీ చానళ్లలో జరిగే చర్చల్లో పాల్గొని నోరేసుకుని మాట్లాడేవారికే పార్టీ పదవులను కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. వై.వి.బి.రాజేంద్రప్రసాద్, బొండా ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనూరాధ, వర్ల రామయ్య తరచుగా టీవీల్లో కనపడి పెద్దల కనుసన్నల్లో పడ్డారని అంటున్నారు. బొండా, వైవీబీకి ఇప్పటికే పదవులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు మరచి... గతంలో అర్బన్ కమిటీ వేస్తున్నప్పుడు మంత్రి దేవినేని ఉమా వర్గానికి చెందిన గన్నే నారాయణ ప్రసాద్ (అన్నా)కు నగర కార్యదర్శి ఇచ్చేందుకు ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వర్గానికి చెందిన కె.పట్టాభిరామ్‌కు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆయనకు రాష్ట్ర కమిటీలో పదవి దక్కలేదు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూశారని విమర్శ వస్తోంది. గతంలో నగర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ముష్టిశ్రీనివాస్కు ఇప్పుడు స్థానం కల్పించలేదు. కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు, తూమాటి ప్రేమనాథ్ వంటి సీనియర్లను పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదేం జాతీయ కమిటీ? టీడీపీ జాతీయ కమిటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతలకే అవకాశం కల్పించారు. ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ వంటి రాష్ట్రాల్లోనూ తెలుగువారున్నారు. వారికి అవకాశం కల్పించకపోవడంతో ఇదేం జాతీయ కమిటీ అన్న విమర్శలు వస్తున్నాయి. -
విస్తరణ వ్యూహం !
సాక్షి,సిటీబ్యూరో: మతవిద్వేష పూరిత ప్రసంగాల అభియోగాలను మూటకట్టుకున్న ‘మజ్లిస్’ జాతీయస్థాయిలో పార్టీ విస్తరణకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. రాబోయే కాలంలో తెలంగాణ, సీమాంధ్రతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్,గుజరాత్,బీహార్ తదితర రాష్ట్రాల చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి తీరుతామని పార్టీ అధినే త, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఐదోవర్ధంతి సందర్భంగా పాతబస్తీలోని ఖిల్వత్ మైదానంలో శనివారం అర్ధరాత్రి వరక జరిగిన సభలో అసదుద్దీన్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను సవివరంగా వెల్లడించారు. పార్టీ నగరానికే పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో విస్తరించి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్ర,కర్ణాటకల్లోని స్థానిక సంస్థల్లో అడుగుపెట్టామని, భవిషత్తులో చట్టసభల్లో కూడా ప్రవేశించి ముస్లింల పక్షాన గళం విప్పుతామని తెలిపారు. గుజరాత్లో ముస్లింలపై జరుగుతున్న అఘాత్యాలను ఎండగడుతూ..అక్కడ ముస్లింలకు రక్షణ లేకుండాపోయిందని, కనీసం మైనార్టీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. త్వరలో గుజరాత్ ముస్లింల హక్కులను కాపాడి, హిందుత్వ మోడీని రాజకీయంగా ఎదుర్కొని తీరుతామని శపథం బూనారు. టీడీపీని మోడీ తన ‘ట్రాప్’లో వేస్తున్నారని..అందులో భాగంగానే ఎన్టీఆర్‌ను పొగిడి పచ్చచొక్కాలను సంతోషపెట్టారని ఎద్దేవా చేశారు. అదే పార్టీ బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేందుకు తహతహలాడుతుందని విరుచుకుపడ్డారు. జాతీయస్థాయి పర్యటనకు అక్బర్ కుతూహలం: జాతీయస్థాయి పర్యటనపై పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్ధీన్ ఒవైసీ ఆసక్తి వ్యక్తం చేశారు. ఖిల్వత్సభలో తన మనస్సులోని మాటను బయటపెట్టారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్నాయని, పార్టీ అధినేత ఆదేశిస్తే పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. ముస్లింల హక్కుల పరిరక్షణకు విస్తృతంగా పర్యటించేందుకు వెనుకాడబోనని ప్రకటించారు. -
15న ఫ్రీడమ్ రైడ్
సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి: నగరం మరో ఆసక్తికరమైన ఈవెంట్‌కు వేదిక కానుంది. స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ది అట్లాంటా ఫౌండేషన్’ నిర్వహించనున్న సైక్లింగ్ ఈవెం ట్లో 6వేల మంది కార్పొరేట్ ఉద్యోగులు పాల్గొననున్నారు. తాజ్‌కృష్ణా హోటల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అట్లాంటా ఫౌండేషన్ వ్యవస్థాపకులు దీనానాథ్ మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 15న దేశ 66వ స్వాతంత్రదినోత్సవానికి సూచికగా 66 కి.మీ. ఫ్రీడమ్‌రైడ్‌ను నిర్వహిస్తున్నామని, ఇది జాతీయస్థాయిలో అతిపెద్ద కార్పొరేట్ సైక్లింగ్ ఈవెంట్ అని ఆయన పేర్కొన్నారు. దీనిలో 50 బహుళజాతి సంస్థలకు చెందిన దాదాపు 6వేల మంది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొం టారని అంచనా వేస్తున్నామన్నారు. కనీసం 2 కి.మీ. తగ్గకుండా సైక్లింగ్ చేసే ప్రతి ఒక్కరికీ అవకాశం ఉండేలా పలు రైడ్స్‌ను ఇందులో భాగం చేశామన్నారు. ప్రొఫెషనల్స్ కోసం పతకాలు, నగదు బహుమతులను అందించనున్నామన్నారు. మహిళల సైక్లింగ్ టీమ్ ప్రత్యేక ఆకర్షణ కాగా క్యాపిటల్ గేమ్ వంటివి ప్రతి ఒక్కరూ పాల్గొని సైకిల్ లేదా ఇతర బహుమతులు గెలుచుకునేందుకు వీలుగా డిజైన్ చేశామన్నారు. ఇది పూర్తిస్థాయి సైక్లింగ్ కార్నివాల్‌గా ఆయన అభివర్ణించారు. రైడర్స్ కిట్‌తో సహా ఇందులో పాల్గొనేవారు రూ.1250 చొప్పున చెల్లించాలని తెలిపారు. లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా తాము విరాళాలు స్వీకరించబోమని, గత ఐదేళ్లుగా ఈవెంట్ల నిర్వహణ ద్వారా సేకరించిన నిధులను నిరుపేద విద్యార్థుల విద్యార్జనకు వినియోగిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగినవారు www.atlantafoundation.org లేదా info@atlantafoundation.orgకు మెయిల్ చేయడం లేదంటే ఫేస్బుక్ ద్వారా గాని పాల్గొనవచ్చునన్నారు. త్వరలో గాంధీజయంతి సందర్భంగా నగరంలోని బాపూఘాట్ నుంచి గుజరాత్‌లోని సబర్మతి వరకూ 1200 కి.మీ. లాంగ్ సైక్లింగ్‌రైడ్‌ను నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్ మాట్లాడుతూ నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు పలు రకాల చర్యలు చేపట్టనున్నామన్నారు. భారత్ బయోటెక్ కో ఫౌండర్ సుచిత్రాఎల్లా, రాష్ట్ర సైక్లింగ్ క్రీడాకారుడు రమణ్ గరిమెల్ల, బ్యాంక్ ఆఫ్ అమెరికా సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రమేష్ కాజలు మాట్లాడారు.