విస్తరణ వ్యూహం !
సాక్షి,సిటీబ్యూరో: మతవిద్వేష పూరిత ప్రసంగాల అభియోగాలను మూటకట్టుకున్న ‘మజ్లిస్’ జాతీయస్థాయిలో పార్టీ విస్తరణకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. రాబోయే కాలంలో తెలంగాణ, సీమాంధ్రతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్,గుజరాత్,బీహార్ తదితర రాష్ట్రాల చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి తీరుతామని పార్టీ అధినే త, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఐదోవర్ధంతి సందర్భంగా పాతబస్తీలోని ఖిల్వత్ మైదానంలో శనివారం అర్ధరాత్రి వరక జరిగిన సభలో అసదుద్దీన్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను సవివరంగా వెల్లడించారు.
పార్టీ నగరానికే పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో విస్తరించి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్ర,కర్ణాటకల్లోని స్థానిక సంస్థల్లో అడుగుపెట్టామని, భవిషత్తులో చట్టసభల్లో కూడా ప్రవేశించి ముస్లింల పక్షాన గళం విప్పుతామని తెలిపారు. గుజరాత్‌లో ముస్లింలపై జరుగుతున్న అఘాత్యాలను ఎండగడుతూ..అక్కడ ముస్లింలకు రక్షణ లేకుండాపోయిందని, కనీసం మైనార్టీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. త్వరలో గుజరాత్ ముస్లింల హక్కులను కాపాడి, హిందుత్వ మోడీని రాజకీయంగా ఎదుర్కొని తీరుతామని శపథం బూనారు. టీడీపీని మోడీ తన ‘ట్రాప్’లో వేస్తున్నారని..అందులో భాగంగానే ఎన్టీఆర్‌ను పొగిడి పచ్చచొక్కాలను సంతోషపెట్టారని ఎద్దేవా చేశారు. అదే పార్టీ బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేందుకు తహతహలాడుతుందని విరుచుకుపడ్డారు.
జాతీయస్థాయి పర్యటనకు అక్బర్ కుతూహలం: జాతీయస్థాయి పర్యటనపై పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్ధీన్ ఒవైసీ ఆసక్తి వ్యక్తం చేశారు. ఖిల్వత్‌సభలో తన మనస్సులోని మాటను బయటపెట్టారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్నాయని, పార్టీ అధినేత ఆదేశిస్తే పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. ముస్లింల హక్కుల పరిరక్షణకు విస్తృతంగా పర్యటించేందుకు వెనుకాడబోనని ప్రకటించారు.