కాకి దూరిన ఇల్లు ఇదే (ఇన్‌సెట్‌లో) సుబ్బరాయుడు కుటుంబం (ఫైల్)
తిమ్మాపురం గొంతు మూగబోయింది. మిద్దె పైకప్పు కూలి భార్యా పిల్లలు మృతి చెందడం, యజమాని తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలవడం అందరినీ కలచివేస్తోంది. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితం ఇలా అర్ధంతరంగా ముగియడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
అనంతపురం, కంబదూరు: కంబదూరు మండలం తిమ్మాపురానికి చెందిన వడ్డే సుబ్బరాయుడు, తిమ్మక్క (30) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు రవి (11) ఆరో తరగతి, కుమార్తె మహాలక్ష్మి (8) నాలుగో తరగతి చదువుతున్నారు. దంపతులు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకునేవారు. అలా సాఫీగా సాగిపోతున్న సమయంలో మూడు నెలల కిందట ఇంట్లోకి కాకి దూరింది. ఇంటికి అరిష్టం జరిగిందని, ఇక్కడే ఉంటూ తమకూ ఏదో ఒకటి జరుగుతుందనే మూఢనమ్మకంతో సుబ్బరాయుడు కుటుంబం సొంతింటిని వదిలి గ్రామంలోని పాత మిద్దెలో అద్దెకు వెళ్లారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ పాత మిద్దెలో నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో మిద్దె దూలం విరిగా పడటంతో తిమ్మక్కతో పాటు కుమారుడు రవి, కుమార్తె మహాలక్ష్మి దుర్మరణం చెందారు. సుబ్బరాయుడు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. రెండు రోజుల్లో సొంతింటికి రంగు వేయించి వెళ్లాలనుకున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. బుధవారం ఉదయం కళ్యాణదుర్గం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.
విషాదఛాయలు
మిద్దె కూలి ఒకే ఇంటిలో ముగ్గురు మృతి చెందడంలో తిమ్మాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండడంతో బంధువులు, గ్రామస్తులందరూ ‘అయ్యోపాపం.. అప్పుడే నూరేళ్లు నిండాయా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇల్లు మారకుండా ఉండి ఉంటే ప్రాణాలైనా దక్కేవని, మూఢనమ్మకాలు పట్టించుకోకుండా ఇల్లు శుభ్రం చేసుకుని ఉండి ఉంటే బాగుండేదని చర్చించుకున్నారు.
ఎమ్మెల్యేపై స్థానికుల ఆగ్రహం
మిద్దె కూలి ముగ్గురు మృతి చెందితే ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి చూసేందుకు కూడా రాకపోతే ఎలా అంటూ స్థానికులు ఆగ్రహించారు. తహసీల్దార్ మసూద్‌వలి ఆలస్యంగా సంఘటన స్థలానికి చేరుకోవడంపై కూడా స్థానికులు మండిపడ్డారు.
మూఢ నమ్మకాలతోనే ఇల్లు మార్చాడు
కాకి దూరిన ఇంటిలో ఉండటం మంచిది కాదనే మూఢనమ్మకాలతోనే సుబ్బరాయుడు కుటుంబం సొంత ఇంటిని వదలి ఆద్దె ఇంటిలోకి కాపురాన్ని మార్చాడు. గతంలో కూడా గ్రామంలో కొంత మంది ఇళ్లలోకి కాకులు ప్రవేశించాయని, మూడు నెలల పాటు వేరే ఇళ్లలోకి కాపురాలు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటివి పూర్వం నుంచి కొనసాగుతున్నాయి.–హరినాథ్, మాజీ సర్పంచ్
ఉద్విఘ్న క్షణాలు
మిద్దె పైకప్పు కూలిన సమయంలో తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్న సుబ్బరాయుడును అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం ఉదయం కాస్త స్పృహలోకి వచ్చాక రాత్రి జరిగిన ప్రమాదం గుర్తొచ్చింది. భార్యా పిల్లలు ఏమయ్యారో తెలుసుకోవాలనుకున్నాడు. తన వద్ద ఉన్న బంధువులను ఆతృతగా అడిగాడు. వారు బాగున్నారని.. నీవు టెన్షన్ పడవద్దని ధైర్యం చెప్పారు. అయినప్పటికీ అతని ధ్యాస కుటుంబ సభ్యులపైనే ఉంది. వారిని చూస్తే కానీ నమ్మే పరిస్థితి లేకపోవడంతో బంధువులపై ఒత్తిడి తెచ్చాడు. అయితే వారు అతడి ఆరోగ్యం దృష్ట్యా అసలు విషయం చెప్పలేదు. ప్రమాదంలో మృతి చెందిన భార్యా, కుమారుడు, కుమార్తెల అంత్యక్రియలకు సాయంత్రం స్వగ్రామంలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సుబ్బరాయుడును ఆస్పత్రి నుంచి వాహనంలో తిమ్మాపురం తీసుకొచ్చారు. అప్పటికే జనం అంతా గుమికూడి ఉండటంతో ఏదో జరిగిందని భావించాడు. ఇక చివరికి భార్యా,పిల్లలు చనిపోయిన విషయాన్ని తెలిపారు. అంతే ఒక్కసారిగా సుబ్బరాయుడు భావోద్వేగానికి లోనయ్యాడు. గట్టిగా రోదిస్తుండటంతో కడసారి చూపు చూపించిన అనంతరం అతడిని తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment