
కూతుర్ని కాపాడబోయి తల్లీ మృత్యువాత
బావిలో పడిన చిన్నారి...
చిలకలూరిపేటరూరల్: కన్న బిడ్డను కాపాడే ప్రయత్నంలో బిడ్డతోపాటు తల్లి కూడా మరణించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో మురికిపూడి గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసుల సమాచారం మేరకు.. మురికిపూడి గ్రామానికి చెందిన కొమ్మనబోయిన కోటయ్య, భార్య నాగమణి(26)కి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె చెంచులక్ష్మి నాలుగో తరగతి, ద్వితీయ కుమార్తె జానకి రెండో తరగతి చదువుతున్నారు.
కోటయ్య దంపతులు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో నేలబావి నీటి ఆధారంగా ఆకుకూరలను సాగు చేస్తున్నారు. సోమవారం తల్లి నాగమణి మూడో కుమార్తె వెంకటరమణ(5)ను వెంటపెట్టుకొని సొంత వ్యవసాయ భూమిలో కలుపు తీసేందుకు వెళ్లారు. కుమార్తెను గట్టుపై కూర్చోపెట్టి తినేందుకు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి తల్లి కలుపు తీస్తుంది.
ఈ క్రమంలో కుమార్తె ఆటలాడుకుంటూ వెళ్లి కాలు జారి నేలబావిలో పడింది. చిన్నారి బావిలో పడిన సమయంలో శబ్దం రావటంతో గమనించిన తల్లి పరుగెత్తుకుంటూ వెళ్లి బావిలోకి చూడగా, బిస్కెట్ ప్యాకెట్ పైన తేలియాడుతుంది. దీనిని గమనించిన నాగమణి కుమార్తెను కాపాడేందుకు తానూ దూకింది. సమీపంలోని పంట పొలాల్లో పనులు నిర్వహించుకునే కూలీలు గమనించి బావి వద్దకు చేరుకున్నారు.
ఇదే సమయానికి బావిలోని నీళ్లపైకి బాలిక మృతదేహం తేలింది. అనంతరం తాళ్లు, గడకట్టెల సహాయంతో నాగమణి మృతదేహాన్ని పైకి తీశారు. మృతురాలు నాగమణి తండ్రి సూరబోయిన యలమంద ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్ జిలానీ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
పొలానికి వెళ్లద్దని చెప్పినా.. వచ్చావు
తల్లి, చెల్లి మృతదేహాలు నేలపై పడి ఉండటాన్ని చూసిన ప్రథమ, ద్వితీయ కుమార్తెలు చెంచులక్ష్మి, జానకీ బోరున విలపించారు. తల్లి, చెల్లి మరణించటంతో పాఠశాలకు వెళ్లిన వీరు ఇద్దరిని తీసుకువచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అక్కా చెల్లెళ్లు తీవ్రంగా రోదించారు. వారి రోదనను చూసిన స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి.
ఇద్దరినీ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు అన్ని సౌకర్యాలు అందించే తల్లి, ఆటపాటలు ఆడేందుకు చెల్లి తోడుండేవారు. ఇకపై మాకు తోడు ఎవరూ అంటూ బిక్కముఖాలేశారు. ఈ రోజు పొలానికి వెళ్లవద్దని చెప్పినా.. వచ్చావు అంటూ మృతురాలు భర్త కోటయ్య రోదించిన తీరు గ్రామస్థులను కంటతడిపెట్టించింది.