ఆమె పేరు సుజాత (పేరు మార్చాం). 28 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. పాప వయస్సు రెండేళ్లు. బాబు పది నెలల పసికందు. ఇటీవల ఆమె స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చింది.
బిడ్డలను వదిలించుకుంటున్న వైనం
ఆర్థిక పరిస్థితి, ప్రేమలే కారణం
మరోవైపు భార్యాభర్తల వివాదాలు
దుర్వినియోగమవుతున్న దత్తత చట్టం
అమ్మ.. రెండక్షరాల తియ్యని పదం. బిడ్డకు ఆది గురువు.. ఆమె స్థానం విశిష్టం.. ఆమె ప్రేమ అపూర్వం.. అలాంటి తల్లి ఒడిలో సేదతీరాలని చిన్నారులు కోరుకుంటారు. ఆధునిక పోకడలు పోతున్న ప్రస్తుత సమాజంలో కొందరు తల్లులు కడుపుతీపిని చంపుకొని కన్నపేగును తుంచేస్తున్నారు. చెట్టుకు కాయ భారం కాదన్న నానుడికి సరికొత్త నిర్వచనం చెబుతూ కన్నబిడ్డల్ని ఎలావదిలించుకోవాలా.. అని దారులు వెతుకుతున్నారు.. వారిని అనాథల్లా వదిలేసి చేతులు దులుపుకొంటున్నారు.. చివరికి పిల్లలకు కన్నీరు మిగులుస్తున్నారు.
సాక్షి, విజయవాడ :
ఆమె పేరు సుజాత (పేరు మార్చాం). 28 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. పాప వయస్సు రెండేళ్లు. బాబు పది నెలల పసికందు. ఇటీవల ఆమె స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చింది. తనను భర్త వదిలేశాడని.. ఇద్దరు పిల్లలను పోషించలేనని.. బాబును వదిలేస్తానని చెప్పింది. దీంతో సంబంధిత శాఖ అధికారులు విచారణ చేయిస్తున్నారు. ఆమె చెప్పినదాంట్లో ఎంత వాస్తవముందో పరిశీలిస్తున్నారు.
హారతి, కిరణ్ భార్యాభర్తలు (పేర్లు మార్చాం). వీరికి రెండేళ్ల పాప ఉంది. వివిధ కారణాల వల్ల ఇద్దరి మధ్య తరచు ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో వారిద్దరూ పాపను వదిలించుకోవాలనుకున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సంప్రదించారు. వారి ప్రతిపాదనను అధికారులు అంగీకరించకుండా కౌన్సెలింగ్ చేసి పంపేశారు.
సుహాసిని, రమేష్ (పేర్లు మార్చాం) ఇంజినీరింగ్ చదివారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కాకముందే వారికో మగ శిశువు జన్మించాడు. ఏం చేయాలో అర్థంకాక స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సంప్రదించి బాబును వదిలించుకుంటామన్నారు. దానికి సంబంధిత అధికారులు అంగీకరించారు. బాబును తీసుకోకపోతే ఎక్కడో ఒకచోట వదిలేసే ప్రమాదముందని గమనించి బిడ్డను తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
వసంత (పేరు మార్చాం) సెక్స్‌వర్కర్. ఆమెకో పాప ఉంది. తన వృత్తికి అడ్డంకిగా ఉండడమే కాకుండా పోషించలేని పరిస్థితి ఎదురవుతోందని ఆమె పాపను వదిలించుకుంది.
కన్నప్రేమ ముందు ఏ ప్రేమా ఎక్కువ కాదు. కానీ కన్నపేగు కాఠిన్యం ప్రదర్శిస్తోందనడానికి పై ఉదాహరణలే నిదర్శనం. ఎంత కష్టం వచ్చినా బిడ్డకోసం తపనపడేవారిని మనం చూస్తుంటాం. సమస్యలను లోలోనే దిగమింగి పేగుతెంచుకుని పుట్టినవారి కోసం జీవితాలను అర్పిస్తున్న వారెందరో ఉన్నారు. ఒకపూట పస్తులుండి కూడా కొన్ని కుటుంబాలు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిని ప్రయోజకుల్ని చేస్తున్న పరిస్థితినీ చూస్తున్నాం. కానీ ఆధునిక జీవన పద్ధతులు మనిషిని కలుషితం చేస్తున్నాయి. కన్న బిడ్డలను వదిలించుకోడానికి సిద్ధమయ్యేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వద్దకు నెలకు సరాసరి 60 నుంచి 70 మంది వరకు తమ పిల్లలను వదిలించుకునేందుకు వస్తున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. తాము పోషించలేమని కొందరు, భర్త వదిలేశాడు కాబట్టి బిడ్డనూ వదిలించుకుంటానని ఇంకొందరు, ప్రేమమైకంలో పెళ్లికాకముందే జన్మనిచ్చి బిడ్డను వదిలించుకునేవారు మరికొందరు, తమకు స్వేచ్ఛలేదని భావించి కొందరు.. అనేక కారణాలతో తల్లులు పాపానికి ఒడిగడుతున్నారు. పిల్లలను ఇలా వదిలించుకునే సందర్భంలో.. వారి విన్నపాన్ని అంగీకరించకుంటే బిడ్డలను ఎక్కడ చంపేస్తారోనని భయపడి అధికారులు కొన్ని కేసుల్లో రాజీపడుతున్నారు.శిశు గృహా లకు తరలిస్తున్నారు. దత్తత అడిగేవారికి ఇస్తున్నారు. ఇలా తల్లిదండ్రులు వదిలించుకున్న పిల్లల్లో కొందరు శిశుగృహాల్లోనే అనాథలుగా చనిపోతుండడం అత్యంత బాధాకరం.
పిల్లలు లేనివారికి దత్తత...
ఎంత కష్టమొచ్చినా, భర్త విడిచిపెట్టినా పిల్లలను వదిలించుకోవడం సమంజసం కాదని ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ కృష్ణకుమారి, శిశు సంరక్షణ అధికారిణి రమ చెబుతున్నారు. తమ వద్దకు వచ్చే వారికి ఇదే చెబుతున్నామంటున్నారు. ఇలాంటి తల్లిదండ్రులు ఆధునిక సమాజంలో పెరిగిపోతుండటం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎక్కడో పారేసిన బిడ్డలు, అనారోగ్యం, ఇతరత్రా అత్యంత దీనస్థితిలో తల్లిదండ్రులుంటే.. వారి పిల్లలను శిశుగృహాల్లో ఉంచుతామన్నారు. తర్వాత వారిని పిల్లలు లేనివారికి దత్తత ఇస్తామని చెప్పారు. అయితే కొందరి విన్నపాన్ని అంగీకరించకుంటే పిల్లలను ఎక్కడ వదిలేస్తారోనని భయపడి శిశుగృహాల్లో ఉంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. 2006లో వచ్చిన సెంట్రల్ ఎడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ (సీఏఆర్‌ఏ-కార్) మార్గదర్శకాల ప్రకారం దత్తతను అత్యంత పకడ్బందీగా అమలుచేస్తున్నామని చెప్పారు. పిల్లలకు పూర్తి రక్షణ కల్పించడంలో ఇది తోడ్పడుతోంది. కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తూ పిల్లలను వదిలించుకోవడం ఆధునిక సమాజంలో వింత పోకడేనని అభిప్రాయపడుతున్నారు.