
విశాఖపట్నంలోని బ్యాంక్ వద్ద నగదు తీసుకోవడానికి వరుసలో ఉన్న మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది కుటుంబాల్లో ముందే సంక్రాంతి పండుగొచ్చింది. జగనన్న అమ్మఒడి పథకం డబ్బులు ఖాతాల్లో పడడంతో శుక్రవారం బ్యాంకుల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో చిన్నారులెవరూ బడిబయట ఉండకూడదని, పేదల ఇళ్లలో చదువుల వెలుగులు విరజిమ్మాలనే లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు అమలు చేస్తున్న అమ్మఒడిలో రూ. 15 వేలు ఖాతాల్లో పడడంతో.. వందలు, వేల సంఖ్యలో మహిళలు బ్యాంకులకు క్యూ కట్టారు. తమ ఖాతాల్లో డబ్బుపడిందని తెలుసుకున్న వారి మోముల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. ఇక ఇళ్లలో చిన్నారులు సందడిచేస్తూ.. ఇది జగన్ మామ మా చదువుకు కోసం అమ్మకు ఇచ్చిన డబ్బులు అంటూ ఉప్పాంగిపోయారు. తమ ఖాతాల్లో నిధులు జమచేయడంపై తల్లులు స్పందిస్తూ.. నాలుగైదు రోజుల ముందే మా కుటుంబాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఖాతాల్లో నిధులు పడటంతో మహిళలు సెల్‌ఫోన్లలో సమాచారం పంచుకుంటూ మురిసిపోయారు. చాలా చోట్ల స్వీట్లు పంచుకుని.. జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.
రికార్డు సృష్టించిన అమ్మఒడి
లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమైనట్లు చాలామంది తల్లులకు సెల్‌ఫోన్లలో మెసేజ్ అందింది. అలా మెసేజ్ రానివారు.. మెసేజ్ వచ్చినా డబ్బు అకౌంట్‌లో పడిందా? అని తెలుసుకునేందుకు వచ్చినవారితోనూ శుక్రవారం బ్యాంకులన్నీ కిటకిటలాడాయి. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు శాఖలు కిక్కిరిసిపోయాయి. గురువారం చిత్తూరు జిల్లాలో పథకానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టగా.. 24 గంటల్లోపే నిధులు ఖాతాల్లో జమ కావడంపై తల్లులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభమైన 24 గంటల్లోనే 30 లక్షల మంది పైగా తల్లుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమకాగా.. మిగతా వారికి ఒకట్రెండు రోజుల్లో జమకానుంది. ‘రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఇంత వరకూ పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోగా ఇంత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు నిధులు జమ చేసిన సంఘటనలు నాకు తెలిసినంత వరకూ లేవు. ఈ రకంగా అమ్మ ఒడి పథకం రికార్డు సృష్టించింది’ అని ఎస్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
అమ్మఒడి నగదు డ్రా చేసుకునేందుకు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో, చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఎస్‌బీఐ బ్యాంకుల వద్ద బారులు విద్యార్థుల తల్లులు
లబ్ధిదారుల జాబితాలో దాదాపు 43 లక్షల మంది
ప్రభుత్వ, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ పిల్లల్ని చదివిస్తున్న దాదాపు 43 లక్షల మంది తల్లులను ప్రభుత్వం అమ్మఒడి పథకంలో లబ్ధిదారులుగా గుర్తించింది. ఆన్‌లైన్ ద్వారా వీరి ఖాతాల్లో జమ చేసేందుకు రూ. 6,456 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
రోజంతా ఉచితంగా.. టీ!
‘అమ్మ ఒడి’ అమలుపై ఓ టీస్టాల్ యజమాని ఆనందం
పలమనేరు(చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకంతో పేదల కుటుంబాల్లోని పిల్లలకు మేలు జరుగుతుందని.. ఈ పథకాన్ని ప్రవేశపట్టినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ ఓ టీ కొట్టు యజమాని శుక్రవారం రోజంతా ఉచితంగా టీలు పంపిణీ చేశాడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో షబ్బీర్‌ఖాన్ టీ దుకాణానికి మంచి పేరుంది. పేద పిల్లల చదువుల కోసం ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఆనందంతో రోజంతా వందలాదిమందికి టీ ఉచితంగా అందించారు. ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
అమ్మఒడితో భరోసా
నేను కూలి చేస్తేనే పూట గడుస్తుంది. నా భర్తకు మతిస్థిమితం లేదు. నా కొడుకును బాగా చదివించాలని కోరిక. ఫీజులు, పుస్తకాలు కొనాలంటే అప్పులు చేయాల్సిన దుస్థితి. ఇలాంటి సమయంలో అమ్మఒడి పథకంలో రూ.15వేలు ఇవ్వడం నాకు ఎంతో భరోసా ఇచ్చినట్లయ్యింది. సీఎం జగన్ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను.
– నన్నిబూ,కాండ్లమడుగు, బి.కొత్తకోట మండలం, చిత్తూరు జిల్లా
నా కూతురును చదివించగలనన్న ధైర్యం వచ్చింది
నా భర్త, నేను కష్టపడితేనే మా కుటుంబం గడుస్తుంది. మా అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. అమ్మఒడి పథకంలో రూ.15 వేలు ఇవ్వడంతో మా అమ్మాయిని ఎంతవరకైనా చదివించగలమనే నమ్మకం ఏర్పడింది. ఆమె చదువుకు కావాల్సినవన్నీ కొనగలిగే స్తోమత వచ్చింది. మా కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డబ్బులు వేసి మాకు ఎంతో మేలు చేశారు.
– సుమలత, ధర్మవరం, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment