
శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లా కడపలో నిర్మించే స్టీల్ ప్లాంట్‌కు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ) నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు, గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌ఎండీసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. శుక్రవారం సచివాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు, ఉక్కుశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఆయా శాఖలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ఏపీకి పెట్రోలియం, సహజవాయువులు, ఉక్కు రంగాల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ భేటీలో ముఖ్యాంశాలు ఇవీ...
16,554 మత్స్యకార కుటుంబాలకు రూ.81 కోట్లు
తూర్పు గోదావరి జిల్లా పోలవరం మండలం భైరవపాలెంలో జీఎస్‌పీసీ లిమిటెడ్ చేపట్టిన ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.81 కోట్ల పరిహారం పెండింగ్‌లో ఉందని, దీన్ని వెంటనే మంజూరు చేయాలని అధికారులు విజ్ఞప్తిచేశారు. ఈ పరిహారం చెల్లించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రధాన్ ఓఎన్జీసీ అధికారులను ఆదేశించారు.
సీఎస్‌ఆర్ నిధులు ఇచ్చేందుకు ఓకే
చమురు, గ్యాస్ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగినట్టుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద నిధులు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఆయా కంపెనీల టర్నోవర్ మేరకు సీఎస్‌ఆర్ నిధులు ఇచ్చేలా చూస్తామని చెప్పారు.
రాయల్టీలో వాటా ఇవ్వాలని వినతి
చమురు, గ్యాస్ వెలికితీత కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో ఏపీకి వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆఫ్‌షోర్‌లో చమురు, గ్యాస్ వెలికితీత వల్ల పరిసర ప్రాంతాలపై కాలుష్య ప్రభావం పడుతోందని, తీర ప్రాంతాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్ల వల్ల పర్యావరణ పరంగా క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయని, భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజలు, మత్స్యకారుల జీవనోపాధికి కూడా ఇబ్బంది తలెత్తుతోందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చింది.
పెట్రో కాంప్లెక్స్‌కు ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, కాకినాడలో దీన్ని నెలకొల్పేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై పెట్రోలియం శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నతస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ప్రదాన్ తెలిపారు. పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.
రెండు చోట్ల పెట్రోలియం ఎక్స్‌లెన్స్ కేంద్రాలు
కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని «కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశంలో హామీ ఇచ్చారు.
సమస్యల పరిష్కారంపై కృతజ్ఞతలు
పైపులైన్ల ఏర్పాటులో సమస్యలను తొలగించడంతోపాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ చైర్మన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తూర్పు తీరంలో పెట్టుబడులకు ఆసక్తి
దేశానికి తూర్పు తీరంలో ఉన్న ఏపీలో పెట్రో రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకు వస్తున్నాయని ప్రధాన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాలకు సంబంధించి దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నట్టు వెల్లడించారు. విశాఖలో విస్తరణ ప్రాజెక్టులు, కాకినాడలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు ద్వారా, కడపలో స్టీల్ ప్లాంట్ రూపంలో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రధాన్ చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉందని ప్రశంసించారు.
ఏది కావాలన్నా సమకూరుస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటామని, ఏది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి బినోయ్‌రాయ్, పెట్రోలియంశాఖ సంయుక్త కార్యదర్శి అమర్‌నాథ్, ఎన్‌ఎండీసీ సీఎండీ ఎన్.బైజేంద్రకుమార్, గెయిల్ సీఎండీ అశుతోష్ కర్ణాటక్, ఓఎన్జీసీ సీఎండీ శశిశంకర్, హెచ్‌పీసీఎల్ సీఎండీ ముఖేష్ కుమార్ సురానా, ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ పి.కె.రథ్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయం వద్ద ఇన్‌చార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ కేంద్ర మంత్రి ప్రధాన్‌కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి ప్రదాన్‌ను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో మెమెంటోతో సత్కరించి విందు ఇచ్చారు.
ఎన్‌ఎండీసీతో త్వరలో ఎంవోయూ
పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికోసం ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని సమావేశంలో అధికారులు వివరించారు. ప్లాంట్ నిర్వహణలో స్థిరత్వం సాధించేందుకు నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్‌ఎండీసీ ఒప్పందం చేసుకుంటుందని చెప్పారు. ఈమేరకు త్వరలో ఎంఓయూ కుదుర్చుకోవాలని ఉక్కుశాఖ అధికారులను ఆదేశించారు.
ఏపీ అభివృద్ధికి సహకరించండి
కేంద్ర మంత్రి ప్రధాన్‌ను కోరిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్‌ను కోరారు. విభజనతో నష్టపోయిన ఏపీ అభివృద్ధికి సహకరించాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేజీ బేసిన్, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌ను కోరారు. విశాఖలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ సంస్థలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై భేటీలో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment