జోరుగా మీడియాలో ప్రచారం
ఇది మామూలేనంటున్న కుటుంబసభ్యులు
నెల్లూరు: పర్వతారోహకుడు, గిన్నిస్‌బుక్ రికార్డు గ్రహీత మల్లి మస్తాన్‌బాబు దక్షిణ అమెరికాలోని చిలీలో పర్వతారోహణకు వెళ్లారు. 48 గంటల నుంచి ఆయన ఆచూకీ లభ్యం కావడం లేదన్న వార్తలు శనివారం రాత్రి ప్రసార మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ గిరిజన సంఘంలోని అతని తల్లి సుబ్బమ్మ, కుటుంబ సభ్యులు మాత్రం ఇది మామూలేనంటున్నారు. మల్లి మస్తాన్‌బాబు 1974 అక్టోబర్ 9న సంగం మండలం గాంధీ గిరిజన కాలనీలో మల్లి మస్తానయ్య, మస్తానమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య సంగంలో కొనసాగించారు. కోరుకొండలోని సైనిక్ స్కూల్‌లో చదువుకున్నారు. జంషెడ్‌పూర్‌లోని ఎన్‌ఐటీలో బీఈ, ఖరగ్‌పూరులోని ఐఐటీలో ఎంటెక్, కలకత్తాలోని ఐఐఎంలో పీజీడీఏ పూర్తిచేశారు. 2006 జనవరి 19వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మొత్తంగా 172 రోజుల్లో ఏడు పర్వత శిఖరాలను అధిరోహించారు. గిన్నిస్ రికార్డులకెక్కారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. నాలుగు నెలలుగా ఆయన చిలీలో ఉంటున్నారు.
అక్కడ పర్వతారోహణకు వెళ్లిన మస్తాన్‌బాబు 48 గంటలుగా కనిపించడం లేదని, ఆచూకీ కోసం బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం మాధ్యమాల్లో శనివారం రాత్రి జోరుగా సాగింది. ఈ విషయమై మస్తాన్ కుటుంబ సభ్యులను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా అర్జెంటైనాలో వర్షాల కారణంగా సిగ్నల్ దొరికి ఉండకపోవచ్చనీ, పర్వతారోహణకు వెళ్లిన సమయాల్లో ఇలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. తాము ఎవ్వరికి ఫిర్యాదు చేయలేదని వారు పేర్కొన్నారు.
పర్వతారోహకుడు మల్లి మస్తాన్ అదృశ్యం?
Published Sun, Mar 29 2015 3:11 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
Advertisement
Advertisement