న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను కింద ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.1605 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఈనెల 18న సమావేశం కానున్న నేపథ్యంలో ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఈమేరకు ఆయన జీఎస్టీ కౌన్సిల్‌కు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విఙ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు.
రాష్ట్రం ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో జీఎస్టీ బకాయిల విడుదలలో జాప్యంతో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని ఆయన సభ దృష్టికి తెచ్చారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం 2015-16 నుంచి ప్రతి ఏటా జీఎస్టీ కింద రాష్ట్రాలకు చెల్లించే వాటాలో 14 శాతం పెరుదల ఉండాలని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. జీఎస్టీ వల్ల ఏదైనా రాష్ట్ర ఆదాయంలో నష్టం వాటిల్లితే జీఎస్టీ అమలు ప్రారంభమైన మొదటి ఐదేళ్లలో ఆ నష్టాన్ని కేంద్రమే భరిస్తుందని కూడా చట్టం స్పష్టం చేస్తోందన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్టీ ఆదాయంలో నష్టాన్ని ఎదుర్కొంటోందని ఎంపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment