గిన్నిస్ బుక్ ఎక్కెందుకు ప్రయత్నిస్తున్నా: ఎంఎస్
భీమవరం కల్చరల్ : 17 సంవత్సరాల నటనా జీవితం.. 700 సినిమాలు.. ఐదు నందులు.. ఒక ఫిల్మ్‌ఫేర్.. ఇది తన ట్రాక్ రికార్డ్ అంటున్నారు హాస్యనటుడు ఎంఎస్ నారాయణ. భీమవరంలో మాజీ ఎంపీ మెంటే పద్మనాభం నివాసానికి వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అతి తక్కువ కాలంలో 700 సినిమాల్లో నటించిన నటుడ్ని తానేనని చెప్పారు. ఈదిశగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటాల్లోనే.. ‘తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ సినీ రచయిత అవుదామని 1994లో హైదరాబాద్ వెళ్లాను. 1997లో నటుడిగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను.
ప్రస్తుతం ‘గోవిందుడు అందరి వాడే’తో పాటు 15 సినిమాల్లో నటిస్తున్నా. దూకుడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. మాజీ ఎంపీ మెంటే పద్మనాభం సహకారంతోనే సినీ రంగంలోకి ప్రవేశించా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. హాస్యనటులు మల్లికార్జునరావు, ఏవీఎస్, శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇటీవల మరణించడం నాన్నెంతగానో బాధించింది. వారు లేని లోటు చిత్రసీమకు తీర్చలేనిది. హైదరాబాద్‌లో తెలుగు సినిమా వాళ్లకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి.
సినిమాల్లో ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మాండలికాన్ని వాడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మాండలికంలో కూడా సినిమాలు రావచ్చు. ఎందుకంటే సినీ రంగానికి నైజాం ప్రాంతం నుంచే 50 శాతం ఆదాయం వస్తోంది. తెలంగాణ ఆర్టిస్టులతోనే పూర్తిస్థాయిలో సినిమాలు తీసే పరిస్థితి లేకపోలేదు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినీ షూటింగ్‌లకు సరిపడా మౌలిక వసతులు ఉన్నాయి. ఈదిశగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.’ అని అన్నారు.