పి.గన్నవరం మండలంలో బురద బారిన పడి లేస్తూ పడవపై లంకవాసుల పయనం
తూర్పుగోదావరి, అమలాపురం: గోదావరి వరద ఉధృతి తగ్గుతున్నా.. ఏజెన్సీ..లంకవాసులు కష్టాలు తగ్గడం లేదు. వరద తగ్గుతున్న కొద్దీ వారి కష్టాలు రెట్టింపవుతున్నాయి. రహదారులు...ఇళ్లల్లో అడుగుల ఎత్తున పేరుకుపోయిన బురద బాధితుల కష్టాలను రెట్టింపు చేస్తుండగా, లంకల్లోనే కాదు.. డెల్టాలో వందల ఎకరాల్లో వరిచేలు ముంపులోనే ఉన్నాయి. కూరగాయ పంటలు దెబ్బతినడం..ఇదే సమయంలో బహిరంగ మార్కెట్‌లో వాటి ధరలు పెరగడంతో లంకవాసులే కాదు..జిల్లా వాసులు సైతం వరద బాధితులుగా మారిపోతున్నారు.
గోదావరిలో వరద తగ్గు ముఖం పడుతున్నా లంకల్లో పల్లపు ప్రాంతాలు.. ఇళ్లు ఇంకా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి శుక్రవారం ఆరు గంటల సమయంలో సుమారు 9 లక్షల 23 వేల 203 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఎనిమిది రోజులుగా వరదలో ఉన్న ఇళ్లు.. ఊళ్లు ముంపునుంచి బయటపడుతున్నాయి. ఏజెన్సీ, కోనసీమలోని లంకల్లోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద పీడ వీడుతుండగా.. కొత్తగా బురదలో బాధలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు నీటిలో ఉన్న రహదారుల మీద కనీసం నడిచే అవకాశమన్నా ఉండేది? మరీ ముంపు ఉంటే కనీసం పడవల మీద రాకపోకలు సాగించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రహదారులపై అడుగు మేర బురద ఉండడంతో వాహనాల రాకపోకలు ఆరంభం కాలేదు. అడుగుతీసి అడుగు వేస్తే అల్లంతదూరం జారుతున్నారు. ఒక్క రోడ్డు మీదనే కాదు.. ముంపుబారిన పడిన ఇళ్లలో సైతం బురద పేరుకుపోయింది. వరద పూర్తిగా వీడినా బురద కష్టాలు తీరేందుకు రెండు,మూడు రోజుల సమయం పడుతోంది. రహదారులపై పేరుకుపోయిన బుదర తొలగిస్తుండడంతో ఏజెన్సీలో ప్రధాన రహదారులపై రాకపోకలు ఆరంభమయ్యాయి. మారుమూల గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. గోదావరిలో లాంచీలు, పడవల మీద రాకపోకలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. శబరి, గోదావరి వరద బారిన పడిన చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాలు తేరుకుంటున్నాయి.
కోనసీమలో వరికి దెబ్బమీద దెబ్బ...
నెల రోజుల వ్యవధిలో కోనసీమ వరి రైతులు రెండుసార్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు కోనసీమలో సుమారు 1,200 హెక్టార్లలో పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. నారుమడుల దశలోనే పంట పోవడంతో రైతులు కొంతలో కొంత నష్టపోయినా తిరిగి సాగు ఆరంభించారు. ప్రస్తుత గోదావరి వరదలకు ఒక్క కోనసీమలోనే అధికారుల లెక్కల ప్రకారం 8 వేల 833 ఎకరాలపై ప్రభావం ఉందని చెబుతున్నారు. కానీ వాస్తవంగా ఈ నష్టం రెట్టింపు ఉంటుందని అంచనా. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడం, ఒకే సమయంలో వరదలు, వర్షాలు కారణంగా ముంపుతీవ్రత అధికంగా ఉంది. దీనికితోడు అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లు అధ్వానంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఒక్క ముమ్మిడివరం నియోజకవర్గంలోని ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లో 4,893 ఎకరాలు ముంపుబారిన పడ్డాయి. ముంపువీడే అవకాశం లేకపోవడంతో అధికశాతం పంట దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు.
కోనసీమలో మరీ దారుణం...
కోనసీమ లంకల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికీ పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గితేకాని ముంపునుంచి బయట పడే అవకాశం లేదు. అప్పనపల్లి, ముక్తేశ్వరం కాజ్‌వేలపై ముంపునీరు దిగింది. దీంతో పడవల మీద దాటించడం నిలుçపుదల చేశారు. రాజోలు దీవిలోని లంకల్లో ప్రధాన రహదారుల మీద మాత్రమే వరద తగ్గింది. ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేల్లంక, గురజాపులంక, కమిని శివారులు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment