
కిర్లంపూడి: కాపు రిజర్వేషన్లపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. వివరాలిలా ఉన్నాయి.. ‘మీరు అడిగిన వారికి, అడగని వారికి ఇచ్చిన, ఇవ్వని హామీలను దానం చేసి దానకర్ణుడనిపించుకుంటున్నారు. మా కాపు జాతి చిరకాల కోరిక, పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ కోసం చేసిన పోరాటానికి మీ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. 01–02–2016న మీడియాకి మీరిచ్చిన ఇంటర్వ్యూలో మా జాతి కోరిక సమంజసమని చెప్పారు.
అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చారు. ఈరోజు మా కోరికను దానం చేయడానికి మీకెందుకు చేతులు రావడం లేదు? ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయిక్, అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాగా పూజలందుకోవాలే కానీ, పదవి మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోవద్దు’ అని ముద్రగడ పేర్కొన్నారు. దయచేసి తమ జాతి రిజర్వేషన్ సమస్య తీర్చాలని ప్రధాని మోదీని కోరాలని సీఎం జగన్‌కు ముద్రగడ విజ్ఞప్తి చేశారు.