ముకేష్ అంబానీని సత్కరించి జ్ఞాపిక అందిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. శనివారం మధ్యాహ్నం తన కుమారుడు అనంత్ అంబానీతో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వారు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ముకేష్ అంబానీకి ముఖ్యమంత్రి జగన్ సాదర స్వాగతం పలికారు.
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో సీఎం సతీమణి వైఎస్ భారతీరెడ్డి, ముకేష్ కుమారుడు అనంత్, ఎంపీ విజయసాయిరెడ్డి
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌కు అభినందనలు తెలిపిన ముఖేష్ అంబానీ.. ఆ తర్వాత దాదాపు రెండు గంటలకుపైగా చర్చలు జరిపారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం నాడు–నేడు కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఇతర పథకాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ కార్యక్రమాల్లో రిలయన్స్ భాగస్వామ్యంపైనా చర్చించారు. చర్చల్లో ముకేష్ కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment