బీహార్‌కు చెందిన ముఖేష్ హౌరామెయిల్‌లో ప్రయాణిస్తూ ప్రమాద వశాత్తూ రైలునుంచి జారిపడి మృత్యువాత పడ్డాడు. అతని ముఖం ఛిద్రమై... కనీసం గుర్తుపట్టడానికి వీలుకాని పరిస్థితుల్లో ఉంది. అంతేనా.. ఆయన ఎక్కడివారో తెలియజేసే సమాచారం కూడా లభ్యం కాకపోవడంతో కన్నవారికి సమాచారం అందడంలేదు. ఇలాంటి కేసులు నిత్యం విజయనగరం రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో నిత్యం ఎదురవుతూనే ఉన్నాయి. ఎక్కడో పుట్టి... ఎక్కడికో ప్రయాణిస్తూ... దురదృష్టవశాత్తూ ఎంతోమంది రైలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. గుర్తించడానికి వీలుకాని పరిస్థితుల్లో ఉంటున్న వీరి ఆచూకీ లభించడం కష్టమవుతోంది. వీరికోసం వెదుకుతున్న కన్నవారికి కన్నీరే మిగులుతోంది.
విజయనగరం క్రైం: రైలులో ప్రయాణిస్తూ ఎంతోమంది దురదృష్టవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. రైలు నుంచి జారిపడి మృతిచెందిన వారి ముఖాలు కొందరివి పూర్తిగా ఛిద్రమవ్వడం, వారి జేబుల్లో కనీసం వారికి సంబంధించిన వివరాలు లేకపోవడంతో మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా అనాథ శవాల్లా అంతిమసంస్కారం చేసేస్తున్నారు. ఈయన కోసం ఎదురుచూసే వారి తల్లిదండ్రులకు గర్భశోకమే మిగులుతోంది.
మూడేళ్లలో గుర్తించలేని మృతదేహాలు 46
గడచిన మూడేళ్లలో రైలు ప్రమాదాల్లో మరణించిన 46మందిని గుర్తించలేకపోయారు. వీరు ఎక్కడున్నారో వారి తల్లిదండ్రులకు తెలియదు. ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారనే వారి తల్లిదండ్రులు భావిస్తుంటారు తప్ప ఇలా రైలు నుంచి జారిపడి మృతిచెందారని తెలియడంలేదు. సాధారణంగా మృతి చెందినవారి జేబుల్లో ఏవైనా ఆధారాలు లభ్యమైతే రైల్వే పోలీసులు సంబంధిత వ్యక్తులకు సమాచారం అందిస్తారు. అలా ఏమీ లభ్యం కానట్టయితే మృ తుల వద్దనున్న టిక్కెట్లు, ముఖాల ద్వారా ఆయా రైల్వే పోలీసులకు ఫొటోలను పంపిస్తారు. వారి ద్వారా ఆచూకీ తెలుసుకునేందుకు యత్నిస్తారు. కొన్నాళ్లపాటు ఎదురుచూసి ఎవరూ రానట్టయితే అంతిమసంస్కారం చేసేస్తారు.
మృతుల్లో ఎక్కువమంది పరాయిరాష్ట్రం వారే...
రైలునుంచి జారిపడి మృతిచెందిన వారిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. ఒరిస్సా, బీహార్, చత్తీస్‌గఢ్, బెంగళూరు, హర్యానా ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా రైలు నుంచి జారిపడి మృత్యువాత పడుతున్నారు. అలాంటి వారి సమాచారం తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గానే మారుతోంది.
ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ..
రైలు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని గుర్తించలేకపోయినవారిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటున్నారు. రైలు తలుపుల పక్కన చల్లని గాలికోసం కూర్చుని నిద్రలోకి జారి ప్రమాదవశాత్తు పడి మృతిచెందుతున్నారు. గుర్తించని మృతదేహాల ఫొటోలను డీసీఆర్‌బీకి పంపిస్తాం. వారు అన్నీ పరిశీలిస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైల్వే పోలీసు స్టేషన్‌కు సమాచారం అందిస్తాం
- ఎస్.ఖగేశ్వరరావు, ఎస్‌ఐ రైల్వే పోలీసు స్టేషన్
ఎక్కడో పుట్టి...
Published Tue, May 31 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM
Advertisement
Advertisement