ట్రెజరీలో పడిగాపులు!
Published Fri, Apr 1 2016 12:03 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
కోట్లాది రూపాయల బిల్లుల పెండింగ్
అర్ధరాత్రితో ముగిసిన ఆర్థిక సంవత్సరం
ఇబ్బందుల్లో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు
14వ ఆర్థిక సంఘం నిధులకు అడ్డంకి
శ్రీకాకుళం టౌన్: అర్ధరాత్రి.. ఆర్థిక సంవత్సరం ముగిసింది. ప్రభుత్వశాఖల్లో నిధుల విడుదల కోసం ఇటు ట్రెజరీ, అటు పేఅండ్‌అకౌంట్సు శాఖల వద్ద ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఓవైఫు ఫీజింగ్, మరో వైపు ఫైనాన్స్ విభాగం అనుమతుల రాకలో ఇబ్బందుల వల్ల ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు పడిగాపులు తప్పలేదు. జిల్లా వ్యాప్తంగా 14 సబ్ ట్రెజరీల పరిధితో పాటు జిల్లా ట్రెజరీ, పేఅండ్ అకౌంట్సు కార్యాలయం వద్ద గురువారం రాత్రి వరకు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పడిగాపులు కాశారు.
ట్రెజరీలో ఒక్కో అకౌంట్‌కు వందల సంఖ్యలో బిల్లులు వచ్చిపడ్డాయి. జ్యూడిషియల్, పోలీసు శాఖల్లో మార్చి 29వ తేదీ వరకు బిల్లులు స్వీకరించి వాటిపై ఫీజింగ్ లేని కారణంతో నిధులు విడుదల చేశారు. రెవెన్యూ శాఖతో పాటు సంక్షేమశాఖలు, పంచాయతీరాజ్, పరిపాలనా విభాగాల్లో బడ్జెట్ విడుదల ఆలస్యం కావడంతో ఒక్కసారి బిల్లులు చెల్లింపునకు అధికారులు నేరుగా ట్రెజరీ వద్దకు వెళ్లి హైదరాబాద్‌కు మెసేజిల ద్వారా టోకెన్ నంబర్లు పంపించుకుని నిధులు మంజూరు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
సాయంత్రం ఆరు గంటల సమయానికి జిల్లా ట్రెజరీలో 1624 బిల్లులకు రూ.36,26,72,136 నిధులు విడుదలయ్యాయి. ఎనిమిది గంటల సమయానికి మరో రూ. 1,12,89,876 బిల్లులకు అనుమతి లభించింది. కొన్ని బిల్లులు అడ్జస్టుమెంటు బిల్లులుగా మార్పు చేసి.. తర్వాత నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించారు. రెవెన్యూశాఖ పరిధిలో రూ.3 కోట్లుకు పైగా బిల్లులు మంజూరై బ్యాంకులకు పంపించారు. అర్ధరాత్రి వరకు సమయం కేటాయించడంతో పడిగాపులు తప్పలేదు.
పెండింగ్‌లో భారీగానే..పంచాయితీరాజ్ శాఖ పరిధిలో చంద్రన్న బాట నిధులకు సంబంధించి రూ.కోట్ల విలువైన బిల్లులకు చెక్కులు జారీ అయ్యా యి. ఆ చెక్కుల విడుదల సాయంత్రానికి జరగక పోవడంతో ఇంజినీరింగ్ అధికారులు తలలు పట్టుకున్నారు. టూరిజం శాఖ పరిధిలో గిరిజనోత్సవాలకు సంబంధించి రూ.25 లక్షల నిదులు విడుదలయ్యాయి. ఈ బిల్లుకు సాంకే తిక కారణం వల్ల ఆ బిల్లు టోకెన్ ఆలస్యం కావడంతో నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధుల బడ్జెట్ విడుదలైంది.
మార్చి 22వ తేదీలోగా బిల్లులు చెల్లించిన వాటిని మాత్రమే ఆర్థిక శాఖ అనుమతించడంతో రూ.30 కోట్లువిడుదలకు అడ్డంకి ఏర్పడింది. జిల్లాపంచాయతీ అధికారి కోటేశ్వరరావు నేరుగా డిప్యూటీ డెరైక్టర్‌ను కలసి విన్నవించుకోవడంతో సర్థుబాటు బిల్లుగా ఆమె అంగీకరించారు. సంక్షేమశాఖల్లో స్కాలర్‌షిప్పులు, ఇతర డైట్ బిల్లుల పరిష్కారానికి టోకెన్లు ఇచ్చారు. ఈబిల్లులు ఉన్న వాటికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మిగిలిన వాటిని సాయంత్రానికి విడుదల చేయలేదు. ట్రెజరీల పరిధిలో రూ.వంద కోట్లుకు పైగా బిల్లులు విడుదల కావాల్సిఉంది. పేఅండ్ అకౌంట్సు విభాగంలో కూడా ఇదే పరిస్థితి.
Advertisement
Advertisement