నెల్లూరు: సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల నిర్వహణకు కోర్టు గడువు విధించడంతో ప్రభుత్వం స్పందించింది. రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అడుగు ముందుకేసింది.
శనివారం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్లను ఖరారు చేసింది. నెల్లూరు మేయర్ పదవి బీసీలకు రిజర్వ్ కాగా, మిగిలిన ఆరు మున్సిపాలిటీల్లో ఐదు మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
మొదలైన సందడి : రిజర్వేషన్లు ఖరారు కావడంతో నెల్లూరుతో పాటు అన్ని మున్సిపల్ పట్టణాల్లో శనివారం రాత్రి నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. నెల్లూరు కార్పొరేషన్ బీసీలకు రిజర్వ్ కావడం చ ర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్ భానుశ్రీ కోసం బీసీలకే కేటాయించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి భానుశ్రీ, టీడీపీ నుంచి అంచెల వాణి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ తరపు అందరి ఆమోదం మేరకు అధిష్టానం సూచనతో బలమైన అభ్యర్థిని రంగంలో దించనున్నట్లు సమాచారం. జనరల్ కేటగిరిలో ఉన్న గూడూరులో పోటీ రసవత్తరంగా మారనుంది.
ఇక్కడ వైఎస్సార్‌సీపీ బలంగా ఉండటంతో పలువురు నేతలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడనున్నట్లు తెలిసింది. మహిళలకు రిజర్వ్ అయిన కావలిలోనూ పోటీ ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఇక్కడ కూడా వైఎస్సార్‌సీపీ బలంగా ఉండటంతో పలువురు పోటీకి ముందుకొస్తున్నారు. బీసీ(మహిళ)కు రిజర్వ్ అయిన వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య పోటీ జరగనుంది. ఇక ఎస్సీ(మహిళ)కు రిజర్వ్ అయిన సూళ్లూరుపేట, నాయుడుపేటలోనూ బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ ఎస్టీ(మహిళ)కి రిజర్వ్ అయింది. జిల్లాలో ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు ఎమ్మెల్యే పదవులతో పాటు ఇతర కీలక పదవులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు తెరపైకి రావడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
అనుమానాలెన్నో: మరోవైపు మున్సిపల్ ఎన్నికలు జరగడంపై అనుమానాలు నెలకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రపతి పాలన కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డుకావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వార్డుల రిజర్వేషన్లు : నెల్లూరు మేయర్‌తో పాటు 54 వార్డుల రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.