venkatgiri
-
Watch Live: వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ
-
పశుగ్రాసం కోసం పరుగులు
ఆత్మకూరు : పశుగ్రాసం కోసం మెట్ట ప్రాంత రైతులు పరుగులు తీస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో మెట్ట నియోజకవర్గాలైన ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. అన్నదాతలు ముందస్తు చర్యగా పశుగ్రాసాన్ని నిల్వ చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం వరి కోతలు మిషన్ల ద్వారా చేపడతుండటంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. గతంలో కూలీలు వరిని కోస్తే పశుగ్రాసం ఇబ్బడిముబ్బడిగానే లభించేది. ప్రస్తుతం కూలీల కొరత, ధరలు, సమయాభావంతో అన్నదాతలు కోత మిషన్లపైనే ఆధారపడుతున్నారు. కోతమిషన్ల ద్వారా వచ్చే గడ్డి అంతంత మాత్రంగా ఉండటంతో దీని కోసం మెట్ట రైతులు సుదూర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో మోపు రూ.100 పైనే ధర ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్‌కు రూ. 6 నుంచి 9 వేలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. వేసవి కొరతను అధిగమించేందుకు... ప్రస్తుతం వేసవి తీవ్రత అధికంగా ఉండడం, భూగర్భజలాలు అడుగంటడంతో పశువులకు నీరు, పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదముంది. ఇదే తరహా వాతావరణం జూన్ వరకు కొనసాగితే కొరత తప్పదని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో కరువు మండలానికి మూడు మెట్రిక్ టన్నులు, కరువు లేని మండలాల్లో రెండేసి మెట్రిక్ టన్నుల వంతున పశుగ్రాస విత్తనాలను సరఫరా చేసేందుకు పశుసంవర్థకశాఖ సమాయత్తమైంది. కరువు మండలాల సంగతి సరే.. ప్రభుత్వం జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం, దుత్తలూరు, మర్రిపాడు, ఉదయగిరి, రాపూరు, సైదాపురం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. పశుగ్రాసం కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఆయా పశుసంవర్థకశాఖ వైద్యశాలల్లో మినీ క్యాటిల్ క్యాంపులు నిర్వహిస్తూ పశువుల దాణాను సబ్సిడీతో రైతులకు సమకూరుస్తున్నారు. కేజీ ధర రూ.14 ఉండగా ప్రభుత్వం రూ.10 సబ్సిడీని ఇచ్చి కేవలం రూ.4 మాత్రమే రైతుల నుంచి వసూలు చేస్తోంది. అయితే మిగతా మండలాల్లోని పశుపోషకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముందస్తు చర్యలతో పశుగ్రాస కొరత నివారణ పశువులను కాపాడేందుకు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నాం. మిగిలిన మండలాల్లో పశుగ్రాసాన్ని సరఫరా చేయడం గగనమవుతుందనే ఉద్దేశంతో పశుగ్రాస విత్తనాలను సరఫరా చేస్తున్నాం. ఇప్పటివరకు 84 టన్నుల విత్తనాలను పంపిణీ చేశాం. రైతులు అవసరమైతే ఎంత మోతాదు వరకైనా సరఫరా చేసేందుకు సిద్ధం. -డాక్టర్ శ్రీధర్‌కుమార్, జేడీ, పశుసంవర్థకశాఖ -
మున్సిపోల్స్‌కు రంగం సిద్ధం
నెల్లూరు: సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల నిర్వహణకు కోర్టు గడువు విధించడంతో ప్రభుత్వం స్పందించింది. రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అడుగు ముందుకేసింది. శనివారం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్లను ఖరారు చేసింది. నెల్లూరు మేయర్ పదవి బీసీలకు రిజర్వ్ కాగా, మిగిలిన ఆరు మున్సిపాలిటీల్లో ఐదు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. మొదలైన సందడి : రిజర్వేషన్లు ఖరారు కావడంతో నెల్లూరుతో పాటు అన్ని మున్సిపల్ పట్టణాల్లో శనివారం రాత్రి నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. నెల్లూరు కార్పొరేషన్ బీసీలకు రిజర్వ్ కావడం చ ర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్ భానుశ్రీ కోసం బీసీలకే కేటాయించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి భానుశ్రీ, టీడీపీ నుంచి అంచెల వాణి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ తరపు అందరి ఆమోదం మేరకు అధిష్టానం సూచనతో బలమైన అభ్యర్థిని రంగంలో దించనున్నట్లు సమాచారం. జనరల్ కేటగిరిలో ఉన్న గూడూరులో పోటీ రసవత్తరంగా మారనుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ బలంగా ఉండటంతో పలువురు నేతలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడనున్నట్లు తెలిసింది. మహిళలకు రిజర్వ్ అయిన కావలిలోనూ పోటీ ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఇక్కడ కూడా వైఎస్సార్సీపీ బలంగా ఉండటంతో పలువురు పోటీకి ముందుకొస్తున్నారు. బీసీ(మహిళ)కు రిజర్వ్ అయిన వెంకటగిరిలో వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య పోటీ జరగనుంది. ఇక ఎస్సీ(మహిళ)కు రిజర్వ్ అయిన సూళ్లూరుపేట, నాయుడుపేటలోనూ బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ ఎస్టీ(మహిళ)కి రిజర్వ్ అయింది. జిల్లాలో ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు ఎమ్మెల్యే పదవులతో పాటు ఇతర కీలక పదవులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు తెరపైకి రావడంతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. అనుమానాలెన్నో: మరోవైపు మున్సిపల్ ఎన్నికలు జరగడంపై అనుమానాలు నెలకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రపతి పాలన కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డుకావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వార్డుల రిజర్వేషన్లు : నెల్లూరు మేయర్‌తో పాటు 54 వార్డుల రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.