మున్నా ముఠాలో నలుగురి అరెస్టు
మున్నా ముఠాలో నలుగురి అరెస్టు
సాక్షి, ఒంగోలు
నర హంతకుడు మున్నా ముఠాలోని నలుగురు సభ్యులను ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాసన్ తన సిబ్బందితో కలిసి నగరంలోని పోతురాజు కాలువ వద్ద గురువారం సాయంత్రం అరెస్టుచేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, రెండు కత్తులు, తొమ్మిది తూటాలు స్వాధీనం చేసుకున్నారు. తన చాంబర్‌లో ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుప్తనిధులు కనుగొని వెలికితీస్తామని చెప్పి మున్నా పలువురి నుంచి పెద్దఎత్తున నగదు వసూలు చేసేవాడు. తిరిగి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తే వారిని హతమార్చేందుకు తన ముఠాసభ్యులను వినియోగించుకునేవాడు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన గంగాధర్‌రెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీనివాసులు అనే వారిని హత్యచేసేందుకు మున్నా పథకం రచించాడు. ఇంతలో కర్నూలు మూడో పట్టణ ఇన్‌స్పెక్టర్ వలలో మున్నా చిక్కుకుని జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. అప్పుడు తప్పించుకున్న అతడి ముఠా సభ్యులు మహ్మద్ జమాలుద్దీన్ అలియాస్ జమాల్ (బెంగళూరు), ఎస్‌కే ఖాదర్‌బాషా అలియాస్ బాబా (ఒంగోలు), తుమ్మల సురేశ్‌బాబు అలియాస్ సురేశ్ (వేమూరు, గుంటూరు జిల్లా), అప్పలస్వామి నాయుడు (వైజాగ్) ల ను ఒంగోలు పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద ఒక 9 ఎంఎం, మరో 7.68 ఎంఎం తుపాకులు, రెండు కత్తులు, తొమ్మిది తూటాలను స్వాధీనం చేసుకున్నారు. మున్నాపై ఇప్పటికే 20 కేసులు ఉన్నాయని, ఒంగోలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో డీసీ (డోషియర్ క్రిమినల్) షీట్ ఉంది. మున్నా, అతని అనుచరులు జిల్లాలో ఇప్పటికే 13 మందిని హత్య చేశారు. ఇనుప లోడ్లతో వెళ్తున్న లారీ లను దారిమళ్లించేవారు. ఇనుము, లారీలను ముక్కలుగా చేసి పా త ఇనుము కింద అమ్మేస్తారు. మున్నా వద్ద మరో తుపాకీ, బెంగళూరుకు చెందిన ఇమ్రాన్ వద్ద రెండు తుపాకులు ఉన్నట్లు తెలి సిందని, వాటి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు.
కానిస్టేబుల్ నుంచే తుపాకుల సరఫరా
మున్నా, అతని ముఠాకు మోహన్‌కుమార్ అనే సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ తుపాకులు అమ్మేవాడని తమ దర్యాప్తులో తేలినట్లు ఎస్పీ వెల్లడించారు. మోహన్‌కుమార్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాచలంలోని వెంకటాపురం పోలీసుస్టేషన్ గార్డుగా పనిచేస్తున్నాడని తెలిపారు. మోహన్‌కుమార్‌కు పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తి తుపాకులు అందజేసేవాడని చెప్పారు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. తుపాకులను ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి లక్ష రూపాయలకు విక్రయించేవాడని ఎస్పీ వివరించారు. సమావేశంలో ఏఎస్పీ బి.రామానాయక్, నగర డీఎస్పీ పి.జాషువా, తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్, ఎస్‌ఐలు సమీవుల్లా, రంగనాథ్ పాల్గొన్నారు.