పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మిర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) కార్యకర్తను ఆదివారం కాల్చిచంపారు. జమ్మూకశ్మీర్ సీఐడీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్ అహ్మద్ మిర్(30) పూల్వామా జిల్లాలోని తన ఇంటికి వెళుతుండగా కాపుకాసిన ఉగ్రవాదులు ఆయన్ను మార్గమధ్యంలోనే అడ్డుకుని హత్యచేశారు. ఈ విషయమై ఇంతియాజ్ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. తల్లిదండ్రులను చూసి చాలాకాలం కావడంతో ఇంతియాజ్ సొంతబాగ్‌లోని ఇంటికి బయలుదేరాడని తెలిపారు.
అయితే ఇప్పుడు పుల్వామాలో పరిస్థితి బాగోలేదనీ, ఉగ్రవాదులు పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో ప్రయాణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. కానీ ఇంతియాజ్ అంగీకరించలేదనీ, గడ్డం తీసేసి, వస్త్రధారణను మార్చుకుని సొంత వాహనంలో ఊరికి బయలుదేరాడన్నారు. ఇంతియాజ్ రాకపై సమాచారం అందుకున్న ఉగ్రవాదులు అతడిని చేవకలాన్‌లో కిరాతకంగా హతమార్చారని తెలిపారు. మరోవైపు పీడీపీ నేత సయ్యద్ అల్తాఫ్ బుఖారి అనుచరుడు మొహమ్మద్ అమిన్ దార్(40)ను కూడా ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment