సాక్షి, విజయవాడ : బినామీ పేర్లతో అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయాలని, ఖరీదైన, విలువైన ఆస్తులను ప్రభుత్వ అవసరాల కోసం కొనుగోలు చేసి బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 20 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బకాయిలను చెల్లిస్తామని చెప్పినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం 10 వేల లోపు బకాయిలు ఉన్న వారికి నిధులు ఇస్తామంటూ జీవో జారీ చేశారని, కానీ నేటికీ ఆ నిధులు ఎవరికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బాండ్ల వెరిఫికేషన్‌కు హై కోర్ట్ మళ్లీ మూడు నెలల సమయం ఇవ్వడం వలన బాధితులు మరింత ఆందోళన చెందుతున్నారన్నారు. మూడు నెలల్లోగా నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన వాగ్ధానం అమలు చేయాలని కోరారు. మంత్రి వర్గ సమావేశంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. నిధులు విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి మెమొరాండం అందజేస్తామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన డేటా ప్రభుత్వం వద్ద ఉందని ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను ప్రామాణికంగా తీసుకుని బాధితులకు చెల్లింపులు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment