అత్తమామల పాత్రపై అనుమానాలు?
కిరాయి హంతకులు ఉన్నారా..?
మదనపల్లె క్రైం: మదనపల్లె కృష్ణానగర్‌లో శనివారం జరిగిన రియల్టర్ అన్వర్ బాషా(40) హత్య వెనుక కుట్ర దాగి ఉన్నట్టు సమాచారం. అన్వర్‌ను అత్తమామలతో పాటు కిరాయి హంతకులు హత్యచేసి ఉంటారనే కోణంలో టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్వర్ బాషా భార్య ఐదేళ్ల క్రితం భర్తతో గొడవ పడి కువైట్‌కు వెళ్లినట్టు తెలిసింది. అలాగే మృతుని మామ ఖలీల్ బాషా కూడా గత పదేళ్లుగా కువైట్‌లోనే ఉండేవాడని తెలిసింది. అప్పటి నుంచి అన్వర్ అత్తగారి ఇంటిలోనే ఉన్నప్పటికీ కువైట్‌లో ఉన్న భార్యతో మాటలు లేవని మృతుని బంధువులు చెబుతున్నారు. అన్వర్ మామ ఖలీల్ బాషా(55) ఇటీవలే మదనపల్లెకు వచ్చాడు.
అన్వర్ బాషా భార్య కూడా మరో రెండు రోజుల్లో భారత్‌కు రానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ తండ్రి, కూతురు సంపాదించిన డబ్బు, బంగారాన్ని భర్తకు ఇవ్వాల్సి వస్తుందని, అలాగే ఇష్టం లేని భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేకనే ఈ హత్య చేయించారని బంధువులు ఆరోపిస్తున్నారు. ‘ఇంటిలో నాకు ఇష్టం లేని వ్యక్తులు ఎవరు ఉండడానికి వీలు లేదు’ అని అన్వర్ బాషా భార్య పలుమార్లు తన తల్లిదండ్రులను ఫోన్లో హెచ్చరించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భర్త అన్వర్‌బాషాను తండ్రి ద్వారా కిరాయి హంతకులతో హత్య చేయించినట్టు తెలుస్తోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు సాగిస్తే తప్ప నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.