మరోసారి తెగబడ్డారు | Murder attempt on YSRCP leader | Sakshi
Sakshi News home page

మరోసారి తెగబడ్డారు

Published Tue, Jan 7 2014 4:38 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

Murder attempt on YSRCP leader

ముదివర్తి (విడవలూరు), న్యూస్‌లైన్: మండలంలోని ముదివర్తికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత కొండూరు వెంకటసుబ్బారెడ్డిపై మరోసారి సోమవారం ఉదయం హత్యాయత్నం జరిగింది. సినీ ఫక్కీలో మహిళా డీలర్ ఈ హత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు, పోలీస్‌ల కథనం మేరకు.. వెంకటసుబ్బారెడ్డి రోజూలాగానే సోమవారం ఉదయం 5 గంటలక నిద్రలేచి వరండాలో దినపత్రికలను చదువుతున్నారు. 6 గంటల సమయంలో అదే గ్రామంలోని గాంధీ గిరిజన కాలనీకి చెందిన చౌకడిపో డీలర్ గొర్రె సుజన తన ముఖానికి మంకీ క్యాప్ ధరించి చేతిలో గిఫ్ట్ బాక్స్‌ను తీసుకుని ఆ బాక్స్ కింద కత్తితో ఇంటిలోకి వచ్చింది.  పని మనిషి చలికి మంకీ క్యాప్ వేసుకుని వచ్చి ఉంటుందని భావించి ఆయన దినపత్రికలు చదువుతున్నాడు. అయితే సుజన వెంకటసుబ్బారెడ్డి కూర్చున్న కుర్చీ వెనుక వైపు వెళ్లి అతని మెడపై కత్తిలో గాయపరించింది. దీంతో ఆయన అప్రమత్తమై వెనుకకు తిరిగి ఆమెను పట్టుకునే లోపలే మరోసారి అతని తల భాగంపై నరికింది. దీంతో ఆయన కుర్చీలో నుంచి కింద పడిపోయాడు. మరో మారు అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా అతను తేరుకుని లేచి ఆమె చేతిలోని కత్తిని పట్టుకుని, ఎవరు నీవంటూ మాస్క్ తొలగించి చూసే సరికి ఆమె చౌకడిపో డీలర్ గొర్రె సుజనగా గుర్తించి అవాక్కయ్యాడు.
 
 వెంకట సుబ్బారెడ్డిపై జరిగిన హత్యాయత్యాన్ని గుర్తించిన భార్య కొండూరు సునీతమ్మ (ముదివర్తి సర్పంచ్) బయటకు పరుగులు తీసి పెద్దగా కేకలు వేసింది. దీంతో నిందితురాలు సుజన కత్తిని అక్కడే వదలి వేసి పారిపోయే ప్రయత్నం చేసింది. ఇంతలో చుట్టు పక్కల వాళ్లు అక్కడకు చేరుకుని ఆమెను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన వెంకటసుబ్బారెడ్డిని నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న విడవలూరు ఎస్‌ఐ అమీర్‌జాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన మాస్క్, గిప్ట్‌బాక్స్, కత్తిని స్వాధీనం చేసుకుని, నిందితురాలు  సుజనను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులోని జయభారతి వైద్యశాలలో చికిత్స పొందుతున్న కొండూరు వెంకటసుబ్బారెడ్డినినెల్లూరు రూరల్ డీఎస్పీ వీఎస్ రాంబాబు, కోవూరు సీఐ మాణిక్యరావు పరామర్శించి విచారించారు.   
 
 45 రోజుల్లో రెండోసారి
 45 రోజుల వ్యవధిలో కొండూరు వెంకటసుబ్బారెడ్డిపై హత్యాయత్నం జరగడం ఇది రెండో సారి కావడం గమనార్హం. అక్టోబర్ 22వ తేదీన ముదివర్తిలోని ఆయన నివాసంలో కరెంట్ తీగలతో హతమార్చేందుకు ప్రయత్నిం చగా అది విఫలమైంది. మళ్లీ సోమవారం కత్తితో అతనిపై హత్యాయత్నం జరగడంతో ముదివర్తి ఉలిక్కి పడింది. గతంలో జరిగిన హత్యాయత్నం సమయంలో పోలీస్‌లు సరైన రీతిలో స్పందించి ఉంటే మరోమారు ఇలా జరిగేది కాదని స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
 కార్డులు రద్దు చేయించారన్న అనుమానంతో..
 ముదివర్తిలో 23వ నంబర్‌పై రేషన్ దుకాణాన్ని గొర్రె సుజన నిర్వహిస్తోంది. తన దుకాణంలో 300కు పైగా బోగస్ కార్డులు ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న తహశీల్దార్ రమణయ్య బోగస్ కార్డులను రద్దు చేశారు. అయితే ఈ పనిని కొండూరు వెంకటసుబ్బారెడ్డి చేయించారన్న అనుమానంతో అతన్ని హతమార్చేందుకు వారం రోజులుగా పక్కా ప్రణాళికతో పధకం పన్నినట్లుప్రాథమిక విచారణలో తెలింది. అయితే వెంకటసుబ్బారెడ్డిని హత మార్చమని ఆమెను ఎవరైనా పురమాయించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement