హత్య కేసు ఛేదింపు | murder case | Sakshi
Sakshi News home page

హత్య కేసు ఛేదింపు

Published Wed, Dec 10 2014 2:28 AM | Last Updated on Sat, Sep 29 2018 5:29 PM

హత్య కేసు ఛేదింపు - Sakshi

హత్య కేసు ఛేదింపు

ఇద్దరు నిందితులు అరెస్టు
నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన
వివరాలు వెల్లడించిన అద్దంకి సీఐ ప్రసాద్

 
అద్దంకి : బాడుగకు కారు మాట్లాడుకుని ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఆపి డ్రైవర్ (ఓనర్)ను హత్యచేసి కారుతో పరారైన సంఘటనపై నమోదైన కేసును కొరిశపాడు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నాలుగేళ్ల క్రితం 2010లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మొత్తం నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ ఆ వివరాలు వెల్లడించారు.

పలు నేరాలకు సంబంధించి చెంచల్‌గూడా జైలులో శిక్ష అనుభవిస్తున్న కర్నూలు జిల్లా పెద్దపూజర్ల గ్రామానికి చెందిన నర బసవరాజు, మహ్మద్ఫ్రీ, కె.రాజశేఖర్ అలియాస్ సుదర్శన్‌లు స్నేహితులుగా మారారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ముఠాగా ఏర్పడి దొంగతనాలు, దోపిడీలు చేయడం ప్రారంభించారు. హైదరాబాదు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో 2010లో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన రూపేష్ కార్‌ట్రావెల్స్ ఓనర్ (డ్రైవర్) ఏ గోవిందరావు ఇన్నోవా కారును బాడుగకు మాట్లాడుకున్నారు. కర్నూలు జిల్లా పెద్దపూజర్ల గ్రామం నుంచి విజయవాడ వెళ్లేందుకు బాడుగ మాట్లాడుకుని ప్రయాణిస్తున్నారు. జాతీయ రహదారిపై కొరిశపాడు మండలం పీ గుడిపాడు గ్రామ శివార్లలోకి కారు రాగానే ఆపించారు.

రోడ్డుపక్కన పొలాల్లోకి వెళ్లి మద్యం సేవించి డ్రైవర్ గోవిందరావుకు కూడా తాపించారు. అనంతరం అతని చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి చెట్టుకు కట్టిపడేశారు. శ్వాస తీసుకోలేని విధంగా చేసి హత్యచేశారు. ఆ తర్వాత ముగ్గురూ కారుతో ఉడాయించారు. ఆ మరుసటిరోజు గోవిందరావు మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అతని చొక్కా జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. సంఘటనపై అప్పటి కొరిశపాడు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నలుగురు ఎస్సైలు, ఆరుగురు సీఐలు మారిన నాలుగేళ్ల తర్వాత ప్రస్తుత ఎస్సై శివకుమార్ కేసును ఛేదించారు.
 
కేసు ఛేదింపు ఇలా...

 
నిందితుల్లో ఒకరైన రఫీ చిత్తూరు జిల్లా చంద్రగిరి పీఎస్‌లో నమోదైన మరో కేసులో పట్టుబడి విచారణలో వెల్లడించిన వివరాల ప్రకా రం కొరిశపాడు హత్య కేసును పోలీసులు ఛేదించారు. డ్రైవర్‌ను హత్యచేసి అపహరిం చిన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌కు సంబంధిం చింది కాగా, హైదరాబాద్‌కు చెందిన కార్లకు నకిలీ నంబర్లు మార్పిడిచేసే ఎం.బుచ్చిరెడ్డి సాయంతో ఏపీ రిజిస్ట్రేషన్‌గా మార్చివేశారు. అనంతరం ఆ కారును విక్రయించగా, ఇప్పటి వరకూ ఆరుగురి చేతులు మారింది. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కొనుగోలు చేసిన వారందరినీ విచారించుకుంటూ వెళ్లి నిందితులను పట్టుకున్నారు.
 
నిందితుల్లో ఒకరు మృతి, మరొకరు జైలులో...

2011లో కారు అమ్మగా వచ్చిన నగదు పంపిణీలో విభేదాలు తలెత్తడంతో నిందితుల్లో రాజశేఖర్ అలియాస్ సుదర్శన్‌ను బసవరాజు అనే మరో నిందితుడు హత్యచేశాడు. మరో నిందితుడు రఫీ వేరే కేసులో కడప సెంట్రల్ జైలులో ఉన్నాడు. మూడో నిందితుడైన బసవరాజుతో పాటు కారుకు నకిలీ నంబర్ మార్పిడిచేసిన ఎం.బుచ్చిరెడ్డిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు. సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం వద్ద నిందితులు ఉండగా అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కేసును ఛేదించిన ఎస్సై శివకుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్సై సూర్యనారాయణ, ఏ ప్రభాకర్‌రావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement