
వెంటాడి.. వేటాడి..
పూడూరు, న్యూస్‌లైన్: పట్టపగలే ఓ వ్యక్తిని కర్రలు, గొడ్డళ్లతో వేటాడి.. వెంటాడి చంప డం పూడూరులో కలకలం సృష్టించింది. పొలం తగాదాలు, మహిళల పట్ల అసభ్యం గా ప్రవర్తించిన క్రమంలో సమీప బంధువులే హత్య చేయడం గమనార్హం. అయితే హతుడు మాసగల్ల నర్సింహులుది అంతా నేర ప్రవృత్తే. తన భూమిలోంచి ఎందుకు నడుచుకుంటూ వెళ్లావంటూ గ్రామానికి చెందిన సుభాన్‌రెడ్డిపై కొన్నేళ్ల క్రితం కత్తితో దాడి చేశాడు. తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో కూడా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయిచేసుకునేవాడు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మరోపెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం పొలం విషయంలో అన్న చంద్రయ్యతో గొడవపడి అతడిని హతమార్చాడు. నర్సింహులు వస్తున్నాడంటేనే జనం భయపడిపోయేవారు. చివరికి వావి వరసలు మరిచి సోదరుల కోడళ్లతోనే అసభ్యంగా ప్రవర్తించాడు.
భరించలేకే తుదముట్టించారు?
తమతో అసభ్యంగా ప్రవర్తించాడని కోడళ్లు కుటుంబీకులకు తెలపడం, అప్పటికే వారి మధ్య పొలం తగాదా ఉండడంతో వారిలో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. అదే నర్సింహులు హత్యకు దారితీసింది. మంగళవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే అతడిని అన్న కుమారులు శ్రీనివాస్, సాయిలు కర్రలు, గొడ్డలితో వేటాడారు. మొదటగా కర్రలతో చితకబాదారు. వదిలేస్తే మళ్లీ తమకే ముప్పు వస్తుందని భావించి ఒకరు చేతులుపట్టుకోగా మరొకరు గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపారు. అందరూ చూస్తుండగానే ఈ తతంగం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు.
పథకం ప్రకారమే హత్య..
పథకం ప్రకారమే నర్సింహులును అంతమొందించినట్లు భావిస్తున్నామని సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు. నర్సింహులుది ముందు నుంచే నేర చరిత్ర కావడంతో ఎవరికి వారు తమకెందుకులే అనుకున్నారని, ఎవరూ పోలీసులకు సమాచారం అందించలేదని అన్నారు. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా హతుడి బంధువులు కొందరు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.