Puduru
-
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికులు
సాక్షి, హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మైసమ్మ గడ్డ తండా సమీపంలో గురవారం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అబ్బాయి మృతి చెందగా అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి పూడూరు కస్తురిబా గాంధీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అబ్బాయి చన్గోముల్ గ్రామానికి చెందిన మహేష్‌గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన చన్ గోముల్ పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
పండుగపూట విషాదం
సాక్షి, పూడూరు: హోలీ పండుగ రోజే ఓ ఇంట్లో విషాదం నిండింది. రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. చన్గోముల్ ఎస్ఐ అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలంలోని సోమన్‌గుర్తికి చెందిన పంబాల నగేశ్ (42) రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గురువారం ఉదయం హోలీ వేడుకల్లో పాల్గొని అందరితో సరదాగా గడిపాడు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై గ్రామం నుంచి పొలానికి బయలుదేరాడు. అయితే సోమన్గుర్తి గేటు నుంచి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు గ్రామం వైపు వస్తూ మూలమలుపులో ఇరువురు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నగేశ్ అక్కడి కక్కడే మృతిచెందాడు. మరో బైక్‌పై ఉన్న వారు శ్రీనివాస్, వెంకటేశ్వర్లకు బలమైన గాయాల య్యాయి. వెంటనే పరిగిలోని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య బాలమణి, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నట్లు చన్గోముల్ ఎస్ఐ అరుణ్‌కుమార్ తెలి పారు. కాగా హోళీ పండుగపూట నగేశ్ మృతి చెందడంతో సోమన్‌గుర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సరదాగా గడిపిన తన భర్త పొలానికి వెళ్లి వస్తానని చెప్పి అందరినీ విడిచి వెళ్లావని గుండెలవిసేలా రోదించింది. -
కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
పూడూరు: రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం సాయిబాబా అగ్రోటెక్ కాటన్ జిన్నింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ సహాయంతో పత్తిని ఒక్కచోటికి కుప్ప చేస్తుండగా ప్రమాదవశాత్తూ పొగగొట్టం నుంచి నిప్పు రవ్వలు ఎగిరిపడ్డాయి. ఫైరింజన్లు వచ్చేలోపే మంటలు మిల్లు అంతటా వ్యాపించాయి. ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. సుమారు 10 వేల క్వింటాళ్ల పత్తి బూడిద పాలయినట్లు అధికారులు అంచనావేశారు. -
ఓవర్టేక్ తెచ్చిన ప్రమాదం
పూడూరు: వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్ఐ నాగరాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన మదన్, మౌలాలికి చెందిన విశాల్, అరుణ్, సుమన్‌లు స్నేహితులు. సుమన్ కొండాపూర్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో పనిచేస్తుండగా మిగిలిన ముగ్గురు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి మంగళవారం కారులో వికారాబాద్ సమీపంలోని ఓ రిసార్టుకు బయలు దేరారు. అరుణ్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. పూడూరు మండలం అంగ డిచిట్టంపల్లి కాటన్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే ముందుగా ఉన్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి సమీపంలోని పొలాల్లోకి ఎగిరి పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగారు. అప్పటికే మదన్(28) మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో సుమన్(27) మృతి చెందాడు. అరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. విశాల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారు పూర్తిగా దెబ్బతింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను వికారాబాద్ మార్చూరీకి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. -
‘మన ప్రణాళిక’లో పది పనులకు అత్యంత ప్రాధాన్యం
పూడూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన ప్రణాళిక’లో పది పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు తెలిపారు. మండలంలో అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి 2013-2014లో మంజూరైన పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. మండలానికి గత సంవత్సరంలో జెడ్పీ, బీఆర్జీఎఫ్లకు సంబంధించి రూ. కోటి విలువైన పనులు మంజూరైనట్లు చెప్పారు. అయితే వాటిలో చాలా పనులు అసంపూర్తిగానే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను కాంట్రాక్ట్ తీసుకొని పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్ల లెసైన్సులను రద్దు చేసేందుకు వెనకాడబోమన్నారు. చన్గోముల్ నుంచి వ్యవసాయ పొలాల వరకు ఫార్మేషన్ రోడ్డు మంజూరై అగ్రిమెంట్ అయినా ఇంత వరకు పనులు పూర్తి కాలేదన్నారు. చన్గోముల్, పూడూరు, కంకల్, పుడుగుర్తి గ్రామాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం ప్రహరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కంకల్వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓను గ్రామ ఉపసర్పంచ్ జమీర్ కోరారు. అనంతరం మండల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆమ్రాది భారతమ్మ, ఎంపీడీఓ సుధారాణి, పీఆర్డీఈ అంజయ్య, ఏఈలు నర్సింలు, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి తదతరులు పాల్గొన్నారు. -
పూడూరులో నేవీ వ్యూహాత్మక కేంద్రం
సీఎం కేసీఆర్‌తో వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ భేటీ రంగారెడ్డిలో 42 ఎకరాల దేవాదాయ శాఖ భూమి నేవీకి హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పూడూరు సమీపంలో భారత నావికాదళం వ్యూహాత్మక కేంద్రాన్ని(స్ట్రాటజిక్ సెంటర్) ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న 42 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని నేవీకి అప్పగించాలని తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి కోరారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించి, పూర్తి సహాయసహకారాలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు. నావికా దళం ఏర్పాటు చేయనున్న వ్యూహాత్మక కేంద్ర నిర్మాణానికి మొత్తం 2,900 ఎకరాల భూమి కావాల్సి ఉంది. గతంలో భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో అటవీ భూమి కూడా ఉన్నందున మళ్లీ అడవుల పెంపకంతోపాటు భూమి ధర కలిపి మొత్తం రూ.115.06 కోట్లను నేవీ రాష్ట్ర ప్రభుత్వానికి దశల వారీగా చెల్లిస్తుందని ైవె స్ అడ్మిరల్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇక్కడ కోల్పోయే అటవీ సంపదను మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ముఖ్య అధికారిని సీఎం ఆదేశించారు. ఇక్కడ వ్యూహాత్మక కేంద్రం ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. అక్కడున్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్లడానికి వెసులుబాటు కల్పిస్తామని వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ వివరించారు. ప్రస్తుతం దేశంలో కొచ్చిన్, టుటీకోరి ప్రాంతాల్లో ఇలాంటి స్థావరాలు ఉన్నాయని, ఇది మూడో స్థావరమని నేవీ అధికారులు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. -
నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు కొలిక్కి!
పూడూరు: మండలంలోని దామగుండం అటవీ ప్రాంతం శివారులో నెలకొల్పే నౌకాదళ రాడార్ కేంద్రం (నేవీ స్ట్రాటజిక్ సెంటర్) ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నౌకౌదళం, అటవీశాఖ, జిల్లా ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నౌకాదళ రాడార్ కేంద్రాన్ని మండలంలోని దామగుండం సమీపంలో 2,900 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందుకు మరోచోట ఢీ రిజర్వు చేయనున్నారు. ఈ రాడార్ కేంద్రం ఏర్పాటుతో శత్రు దేశాల జలాంతర్గాముల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి పొంచి ఉండే ప్రమాదాలను కూడా తెలుసుకోవచ్చు. కాగా.. పూడూరు మండలానికే వన్నె తెచ్చే దామగుండం రామలింగేశ్వరాలయాన్ని వదిలేసి నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు నౌకాదళం అధికారులు అంగీకరించారు. సీఎంతో సోమవారం జరిగే సమావేశంలోని అంశాల తుది నివేదికను కేంద్ర అటవీశాఖ, నౌకాదళానికి పంపించనున్నారు. -
మూడు నెలలుగా మూత‘బడి’!
పూడూరు, న్యూస్‌లైన్ : నిజానికి ఆ పాఠశాలలో 15మందికి పైగానే విద్యార్థులున్నారు. అంతా చిన్నపిల్లలే. వీరంతా పక్కగ్రామానికి వెళ్లి చదువుకోలేని వాళ్లు. అయితే కేవలం ఆరుగురే పిల్లలు వస్తున్నారని తప్పుడు సమాచారమిచ్చి పాఠశాలను మూయించారు. దీంతో ఈ పిల్లల్లో చాలా మంది బడి మానేయగా.. ఇద్దరుముగ్గురు పక్క గ్రామానికి వెళ్తున్నారు. పూడూరు మండలంలోని నిజాంపేట, మేడిపల్లి గ్రామాలు కలిపి ఒకే పంచాయతీలో ఉంటాయి. నిజాంపేటలో ప్రాథమిక పాఠశాల ఉండగా, మేడిపల్లిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. నిజాంపేట - మేడిపల్లిల మధ్య దూరం కిలోమీటరు. మూడు నెలల క్రితం నిజాంపేట ప్రాథమిక పాఠశాలను అధికారులు ఎత్తివేశారు. నిజానికి పది మంది కంటే తక్కువ పిల్లలుంటే నిబంధనల ప్రకారం.. పాఠశాలను రద్దు చేస్తారు. కానీ ఇక్కడ 15 మంది చిన్నారులు ఉన్నా కేవలం ఆరుగురే ఉన్నారని నివేదిక పంపడంతో పాఠశాల రద్దయింది. మూడు నెలలుగా విద్యార్థులు బడిలేక ఇళ్ల వద్దే ఆడుకుంటున్నారు. కేవలం ఇద్దరు ముగ్గురే మేడిపల్లికి వెళ్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు దూరం నుంచి విధులకు హాజరయ్యేదని, అది కష్టంగా భావించి సదరు టీచర్ తక్కువమంది విద్యార్థులున్నారని చూపి పాఠశాల మూపించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
వెంటాడి.. వేటాడి..
పూడూరు, న్యూస్‌లైన్: పట్టపగలే ఓ వ్యక్తిని కర్రలు, గొడ్డళ్లతో వేటాడి.. వెంటాడి చంప డం పూడూరులో కలకలం సృష్టించింది. పొలం తగాదాలు, మహిళల పట్ల అసభ్యం గా ప్రవర్తించిన క్రమంలో సమీప బంధువులే హత్య చేయడం గమనార్హం. అయితే హతుడు మాసగల్ల నర్సింహులుది అంతా నేర ప్రవృత్తే. తన భూమిలోంచి ఎందుకు నడుచుకుంటూ వెళ్లావంటూ గ్రామానికి చెందిన సుభాన్రెడ్డిపై కొన్నేళ్ల క్రితం కత్తితో దాడి చేశాడు. తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో కూడా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చేయిచేసుకునేవాడు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మరోపెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం పొలం విషయంలో అన్న చంద్రయ్యతో గొడవపడి అతడిని హతమార్చాడు. నర్సింహులు వస్తున్నాడంటేనే జనం భయపడిపోయేవారు. చివరికి వావి వరసలు మరిచి సోదరుల కోడళ్లతోనే అసభ్యంగా ప్రవర్తించాడు. భరించలేకే తుదముట్టించారు? తమతో అసభ్యంగా ప్రవర్తించాడని కోడళ్లు కుటుంబీకులకు తెలపడం, అప్పటికే వారి మధ్య పొలం తగాదా ఉండడంతో వారిలో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. అదే నర్సింహులు హత్యకు దారితీసింది. మంగళవారం పట్టపగలు అందరూ చూస్తుండగానే అతడిని అన్న కుమారులు శ్రీనివాస్, సాయిలు కర్రలు, గొడ్డలితో వేటాడారు. మొదటగా కర్రలతో చితకబాదారు. వదిలేస్తే మళ్లీ తమకే ముప్పు వస్తుందని భావించి ఒకరు చేతులుపట్టుకోగా మరొకరు గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపారు. అందరూ చూస్తుండగానే ఈ తతంగం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. పథకం ప్రకారమే హత్య.. పథకం ప్రకారమే నర్సింహులును అంతమొందించినట్లు భావిస్తున్నామని సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. నర్సింహులుది ముందు నుంచే నేర చరిత్ర కావడంతో ఎవరికి వారు తమకెందుకులే అనుకున్నారని, ఎవరూ పోలీసులకు సమాచారం అందించలేదని అన్నారు. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా హతుడి బంధువులు కొందరు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం
పూడూరు, న్యూస్‌లైన్: అప్పులు తీరే మార్గం కానరాక తీవ్ర మనోవేదనకు గురైన ఓ అన్నదాత పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. చన్గొముల్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరుకు చెందిన పామెన పెంటయ్య(36)కు ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరికి నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈఏడాది పొలంలో పత్తి, మొక్కజొన్న సాగుచేశారు. తుపానుల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. పంట పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం పెంటయ్య బ్యాంకులో, తెలిసిన వారి వద్ద రూ. 2 లక్షలు అప్పు చేశాడు. పంట తుపానుల పాలుకావడంతో అప్పులు తీరే మార్గం ఆయనకు కనిపించలేదు. ఈక్రమంలో రెండుమూడు రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం పొలం వద్ద పెంటయ్య పురుగుమందు తాగాడు. పొరుగు రైతుల సమాచారంతో కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి పెంటయ్య మృతిచెందాడు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. పెంటయ్యకు భార్య భాగ్యలక్ష్మి, కూతురు మమత, కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. ఆయన మృతితో కుటుంబీకులు గుండెలు బాదుకుంటున్నారు. పెద్దదిక్కు మృతితో కుటుంబం వీధిన పడిందని స్థానికులు తెలిపారు. మృతుడి తల్లి చంద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘టీచకుడి’కి ఈ శిక్ష సరిపోదు
పూడూరు, న్యూస్‌లైన్: ‘టీచకుడి’కి పదేళ్ల జైలు విధించడంపై పలువురు భిన్నంగా స్పందించారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కరస్పాండెంట్ అదుపుతప్పి విద్యార్థినిపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. పూడూరు మండలంలోని పార్కవుడ్ ఇంటర్నేషనల్ పాఠశాల కరస్పాండెంట్ అయూబ్‌ఖాన్ పాఠశాలలో చదివే విద్యార్థినిపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన విషయం గత 2010 జూలై 19న వెలుగు చూసింది. ఈ సంఘటన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో నిందితుడు ఆయూబ్‌ఖాన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జిల్లా విద్యా శాఖ సదరు పాఠశాల అనుమతిని రద్దు చేసింది. నిందితుడు అయాబ్ఖాన్ను కఠినంగా శిక్షించాలంటూ అప్పట్లో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యు వజన, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేశారు. అయాబ్ఖాన్కు నాంపల్లి నాలుగో అదనపు మెట్రోపాలిటన్ జడ్జి పదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. తీర్పుపై మండలవాసులు భిన్నంగా స్పందించారు. తీర్పుపై కొందరు సంతోషం వ్యక్తం చేయగా మరికొందరు శిక్ష చాలా తక్కువేనని అభిప్రాయం వెలిబుచ్చారు. నిందితుడిని ఉరి తీయాల్సిందేనని మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.