పూడూరు, న్యూస్‌లైన్: అప్పులు తీరే మార్గం కానరాక తీవ్ర మనోవేదనకు గురైన ఓ అన్నదాత పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. చన్గొముల్ ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరుకు చెందిన పామెన పెంటయ్య(36)కు ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరికి నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈఏడాది పొలంలో పత్తి, మొక్కజొన్న సాగుచేశారు. తుపానుల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. పంట పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం పెంటయ్య బ్యాంకులో, తెలిసిన వారి వద్ద రూ. 2 లక్షలు అప్పు చేశాడు. పంట తుపానుల పాలుకావడంతో అప్పులు తీరే మార్గం ఆయనకు కనిపించలేదు.
ఈక్రమంలో రెండుమూడు రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం పొలం వద్ద పెంటయ్య పురుగుమందు తాగాడు. పొరుగు రైతుల సమాచారంతో కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి పెంటయ్య మృతిచెందాడు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించారు. పెంటయ్యకు భార్య భాగ్యలక్ష్మి, కూతురు మమత, కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. ఆయన మృతితో కుటుంబీకులు గుండెలు బాదుకుంటున్నారు. పెద్దదిక్కు మృతితో కుటుంబం వీధిన పడిందని స్థానికులు తెలిపారు. మృతుడి తల్లి చంద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం
Published Thu, Dec 19 2013 1:23 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement