పూడూరులో నేవీ వ్యూహాత్మక కేంద్రం
సీఎం కేసీఆర్‌తో వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ భేటీ
రంగారెడ్డిలో 42 ఎకరాల దేవాదాయ శాఖ భూమి నేవీకి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పూడూరు సమీపంలో భారత నావికాదళం వ్యూహాత్మక కేంద్రాన్ని(స్ట్రాటజిక్ సెంటర్) ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న 42 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని నేవీకి అప్పగించాలని తూర్పు నావికాదళం వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి కోరారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించి, పూర్తి సహాయసహకారాలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు. నావికా దళం ఏర్పాటు చేయనున్న వ్యూహాత్మక కేంద్ర నిర్మాణానికి మొత్తం 2,900 ఎకరాల భూమి కావాల్సి ఉంది. గతంలో భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో అటవీ భూమి కూడా ఉన్నందున మళ్లీ అడవుల పెంపకంతోపాటు భూమి ధర కలిపి మొత్తం రూ.115.06 కోట్లను నేవీ రాష్ట్ర ప్రభుత్వానికి దశల వారీగా చెల్లిస్తుందని ైవె స్ అడ్మిరల్ ముఖ్యమంత్రికి తెలిపారు.
ఇక్కడ కోల్పోయే అటవీ సంపదను మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ముఖ్య అధికారిని సీఎం ఆదేశించారు. ఇక్కడ వ్యూహాత్మక కేంద్రం ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. అక్కడున్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వెళ్లడానికి వెసులుబాటు కల్పిస్తామని వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ వివరించారు. ప్రస్తుతం దేశంలో కొచ్చిన్, టుటీకోరి ప్రాంతాల్లో ఇలాంటి స్థావరాలు ఉన్నాయని, ఇది మూడో స్థావరమని నేవీ అధికారులు చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు.