సౌదీ జైలులో ముత్యాలపల్లి వాసి
Published Wed, Sep 4 2013 4:58 AM | Last Updated on Mon, Aug 20 2018 7:33 PM
మొగల్తూరు,న్యూస్‌లైన్: మొగల్తూరు మండలం ముత్యాలపల్లివాసి ఆరునెలలుగా సౌదీ జైలులో మగ్గుతున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. గ్రామానికి చెందిన చిక్కాల గంగరాజు జీవనోపాధి కోసం 15 ఏళ్లుగా మూడు సార్లు సౌదీ అరేబియాకు వెళ్లి వస్తున్నాడు. సంపాదించిన మొత్తంతో పెద్ద కుమార్తెకు వివాహం కూడా చేశాడు. చిన్న కుమార్తె గ్రామంలోనే ఎనిమిదో తరగతి చదువుతోంది. గంగారాజు నాల్గో దఫా 2009లో సౌదీ వెళ్లాడు. ఈసారి అక్కడ చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఆర్థికంగా నష్టపోయాడు.
దీంతో కొంత మొత్తం బాకీ పడ్డాడు. విషయాన్ని గ్రామంలో నివసిస్తున్న భార్య పద్మావతికి చెప్పడంతో ఆమె తమకు ఉన్న అరఎకరం పొలం అమ్మి నగదు పంపింది. ఈనేపథ్యంలో అక్కడే ఉంటున్న గంగరాజు జారిపడ్డంతో కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో మరిన్ని అప్పులు పెరిగాయి. అక్కడ ఉన్న ఏజెంట్ ద్వారా తిరిగి మన దేశానికి వద్దామనే ప్రయత్నంలో మోసపోవడంతో సౌదీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆరునెలల క్రితమే ఈ విషయం భార్యకు తెలిసినా ఆమె గుట్టుగా ఉంచింది.
ఎట్టకేలకు విషయం బయటపడటంతో గంగరాజు వియ్యంకుడు తాడేపల్లిగూడెంలోని కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించారు. భారత ఇమ్మిగ్రేషన్ సంస్థ ద్వారా గంగరాజును దేశానికి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని గంగరాజును విడిపించేందుకు సహకరించాలని పద్మావతి, వారి బంధువులు కోరుతున్నారు.
Advertisement
Advertisement