mutyalapalli
-
పది కిలోల పండుగప్ప
మొగల్తూరు: ముత్యాలపల్లికి చెందిన రైతు కొల్లాటి నాగేశ్వరరావుకు చెందిన చెరువులో పది కిలోల పండుగప్ప చిక్కింది. నాగేశ్వరరావు చెరువులో బుధవారం పట్టుబడి పట్టారు. దీంతో ఈ భారీ పండుగప్ప జాలరుల వలలో పడింది. మార్కెట్లో దీని ధర సుమారు రూ.4 వేలు ఉంటుందని రైతు నాగేశ్వరరావు తెలిపారు. -
ఆక్వా పార్క్ వద్దంటూ మహిళల వినూత్న నిరసన
మొగల్తూరు : జీవనది లాంటి గొంతేరు డ్రెయిన్‌ను నాశనం చేసి తమ పొట్టలు కొట్టవద్దని మహిళలు గొంతెత్తి నినదించారు. మంగళవారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులోని గొంతేరు డ్రెయిన్‌లో పడవలపై వెళ్లి నీటి మధ్యలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమ తాత ముత్తాతల నుంచి ఈ యేరుపై ఆధారపడి బతుకుతున్నామన్నారు. తమ కళ్లెదుటే యనమదుర్రు డ్రెయిన్‌ను నాశనం చేసి మత్స్యకారుల పొట్టకొట్టారని, వేటే జీవనంగా సాగిస్తున్న తమ బతుకులను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందుర్రులో ఏర్పాటు చేసే ఆక్వా పరిశ్రమను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. తిరుమాని నాగేశ్వరరావు, నాగిడి రాంబాబు, కొల్లాటి మంగమ్మ, వాటాల ధనలక్ష్మి, సొర్రా సూర్యావతి, బర్రిచల్లాలు, వాటాల సరస్వతి, తిరుమాని సుమంగళి, గాడి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
సౌదీ జైలులో ముత్యాలపల్లి వాసి
మొగల్తూరు,న్యూస్‌లైన్: మొగల్తూరు మండలం ముత్యాలపల్లివాసి ఆరునెలలుగా సౌదీ జైలులో మగ్గుతున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. గ్రామానికి చెందిన చిక్కాల గంగరాజు జీవనోపాధి కోసం 15 ఏళ్లుగా మూడు సార్లు సౌదీ అరేబియాకు వెళ్లి వస్తున్నాడు. సంపాదించిన మొత్తంతో పెద్ద కుమార్తెకు వివాహం కూడా చేశాడు. చిన్న కుమార్తె గ్రామంలోనే ఎనిమిదో తరగతి చదువుతోంది. గంగారాజు నాల్గో దఫా 2009లో సౌదీ వెళ్లాడు. ఈసారి అక్కడ చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో కొంత మొత్తం బాకీ పడ్డాడు. విషయాన్ని గ్రామంలో నివసిస్తున్న భార్య పద్మావతికి చెప్పడంతో ఆమె తమకు ఉన్న అరఎకరం పొలం అమ్మి నగదు పంపింది. ఈనేపథ్యంలో అక్కడే ఉంటున్న గంగరాజు జారిపడ్డంతో కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో మరిన్ని అప్పులు పెరిగాయి. అక్కడ ఉన్న ఏజెంట్ ద్వారా తిరిగి మన దేశానికి వద్దామనే ప్రయత్నంలో మోసపోవడంతో సౌదీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆరునెలల క్రితమే ఈ విషయం భార్యకు తెలిసినా ఆమె గుట్టుగా ఉంచింది. ఎట్టకేలకు విషయం బయటపడటంతో గంగరాజు వియ్యంకుడు తాడేపల్లిగూడెంలోని కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించారు. భారత ఇమ్మిగ్రేషన్ సంస్థ ద్వారా గంగరాజును దేశానికి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని గంగరాజును విడిపించేందుకు సహకరించాలని పద్మావతి, వారి బంధువులు కోరుతున్నారు.