నా కూతుర్ని చంపేశారు: రహీమా
గుంటూరు : దాదాపు ముప్పయి గంటలు గడిచిన తర్వాత పెంపుడు తండ్రి మద్యం తాగించిన ఘటనలో మృతి చెందిన చిన్నారి షణ్ను విషయంలో కీలక మలుపులు తిరుగుతోంది. చిన్నారి అసలు తల్లి రహీమా బయటకు వచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను సైదానే చంపేశాడని ఆమె ఆరోపించింది. షణ్నును తన భర్త వద్ద వదిలేస్తానని.... అతను తీసుకోకుంటే మదర్సాలో చేర్పిస్తానని సైదా ఇరవై రోజుల క్రితం తన వద్ద నుంచి తీసుకు వెళ్లాడని రహీమా తెలిపింది.
అయితే ఆతర్వాత షణ్నును తండ్రి దగ్గర వదిలేశాడా లేదా అనేది తాను పట్టించుకోలేదని తెలిపింది. సైదా, అతని సోదరుడు ఇస్మాయిల్ కలిసి మద్యం తాగుతూ, చిన్నారికి కూడా తాగించారని, పాప చనిపోయిన తర్వాత సైదా ఆమెను తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడని రహీమా మండిపడింది.
పాప విషయానికొస్తే ... ఆమె కన్నతల్లిదండ్రులు విడిపోగా, సైదా అనే వ్యక్తి దగ్గర పాప ఉంది. అతడు సంతానం లేని ఇస్మాయిల్ దంపతులకు చిన్నారిని ఇచ్చాడు. ఇస్మాయిల్ దంపతులు మద్యం తాగుతూ, చిన్నారికి కూడా తాగించగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు గమనించి, ఆసుపత్రికి తరలించేంతలోపే ఆమె కన్నుమూసింది. అయితే కావాలనే తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని చిన్నారి కన్నతల్లి ఆరోపిస్తోంది.
సైదా మాత్రం ...పాపను తాను తీసుకు రాలేదని, తన ఆఫీసు ముందు రహీమానే షణ్నును వదిలేసిందని, ఇంటికి వెళ్లి అడిగితే తనకు సంబంధం లేదని చెప్పిందని చెబుతున్నాడు. ఇక పాప తండ్రి మాట్లాడుతూ తాను....రహీమా విడిపోయి అయిదేళ్లు అయ్యిందని.... పెద్ద పాప తన దగ్గరే ఉంటుందని, చిన్న పాప తల్లి దగ్గర ఉంటుందని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు చాలా ఆలస్యంగా స్పందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంతవరకూ ఎవ్వరిని అరెస్ట్ చేయకపోగా ... తమ నిర్లక్ష్యమేమీ లేదని పోలీసులు బుకాయిస్తున్నారు.