‘విధివిధానాలపై గందరగోళం లేదు ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుకు సంబంధించి సభలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎలాంటి తికమక లేదని, సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం ఈ బిల్లుకు సంబంధించి ఓటింగ్ ఉండాలని కొందరు, ఓటింగ్ పెట్టరాదని కొందరు, బిల్లుపై ఏ విధానం పాటిస్తారో సభాపతి స్పష్టత ఇవ్వాలని ఇంకొందరు వాదనలు వినిపించిన నేపథ్యంలో స్పీకర్ వివరణ ఇచ్చారు. ‘‘ఇది చాలా క్లిష్టమైన అంశం. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానం ఉంది. సంప్రదాయాలను పాటిస్తాం. ఏ నిర్ణయమైనా సమష్టిగానే తీసుకుంటాం. బిల్లుపై ప్రతి సభ్యుని అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం కల్పించాలని రాష్ట్రపతి పంపిన నోట్‌లో కూడా సూచించారు. సభ పాటించనున్న విధానంపై అపోహలు అవసరం లేదు’’ అని ప్రకటిస్తూ సభను గురువారానికి వాయిదా వేశారు.
అంతకుముందు సభ్యుల అభిప్రాయాలివీ..
మంత్రి జానారెడ్డి: ఆర్టికల్ -3 ప్రకారం బిల్లుపై అసెంబ్లీలో తీర్మానంకానీ, ఓటింగ్‌కు వీలులేదు. బాబూలాల్ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయం స్పష్టం చేసింది. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును వ్యతిరేకించే అధికారం ఎవరికీ లేదు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ: బిల్లుపై గడువు వారం పొడిగించినట్లు సమాచారం వస్తోంది. బిల్లుపై ఏ విధానం అనుసరించాలనే విషయంలో తుది నిర్ణయం స్పీకర్‌దే. అయితే బీఏసీలో చర్చించి స్పష్టంగా ప్రకటించాలి.
టీడీపీ సభ్యుడు అశోక్ గజపతిరాజు: ఏ బిల్లు అయినా ప్రవేశపెట్టిన సమయంలో ఎవరూ వ్యతిరేకించరు. తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సమయంలో కౌంటింగ్ జరపకుంటే సభ అభిప్రాయం ఎలా తెలుస్తుంది?