చింతపల్లి/కొండమల్లేపల్లి(నల్లగొండ)/ వంగూరు/అమ్రాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్-నాగార్జున సాగర్ రహదారిపై గురువారం రాత్రి నల్లగొండ జిల్లా చింతపల్లి సమీపంలోని రాజ్యతండా వద జరిగిన రోడ్డు ప్రమాదం పాలమూరు జిల్లాలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
వారిలో వంగూరు మండలం డిండి చింత పల్లికి చెందిన కొమ్మెర వెంకటయ్య (40), ఉప్పాల వెంకటమ్మ(35), అమ్రాబాద్ మండలం పదరకు చెందిన వేముల నాగులు(29), గుంజ మల్లయ్య(59), వేముల మల్లయ్య(48) ఉప్పునుంత ల మండలం పెనిమిల్లకు చెందిన ఎల్లస్వామి (27) ఉన్నారు. కాగా ఉప్పాల వెంకటయ్య, రమేశ్ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన కూలీలు హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరు గురువారం దేవరకొండ మండలం తెలుగుపల్లిలో తెలిసిన వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తుఫాన్ వాహనంలో హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. చింతపల్లి మండలం వెంకటంపేట సమీపంలో రాజ్యాతండా మూలమలుపులో ఎదురుగా వస్తున్న టాటాఏస్ అతివేగంగా వీరు ప్రయాణిస్తున్న జీపును ఢీకొంది. అదే సమయంలో టాటాఏస్ వెనుక వస్తున్న మరో లారీ ఈ రెండు వాహనాలను ఢీ కొనడంతో టాటాఏస్, తుఫాన్ వాహనాల్లో ఉన్న 12 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో 16మంది తీవ్రం గా గాయపడ్డారు. వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
అతివేగమే ప్రాణం తీసిందా?
హైదరాబాద్ తిరిగివస్తున్న వారు దారిలో కొండమల్లేపల్లి వద్ద కొద్ది సేపు ఆగి మద్యం సేవించడమేగాక తమతో పాటు డ్రైవర్‌కు కూడా తాగించారు. మద్యం మత్తులో అతివేగంగా వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని పోలీసులు పోలీసులు పేర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు వారు పేర్కొన్నారు.
బాధితులను పరామర్శించిన
ఎమ్మెల్యేలు...
దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల బంధువులను దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు శుక్రవారం పరామర్శించారు. మృతదేహాలను స్వగ్రామాలకు పంపించేందుకు పోలీసులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. తక్షణమే పోస్టుమార్టం నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.
వలస బతుకుల్లో కుదుపు
Published Sat, Sep 21 2013 3:51 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM
Advertisement
Advertisement