రుణమాఫీపై అన్నదాతల ఆక్రోశం
మెలికలు, నిబంధనలతో అందని లబ్ధి
అర్హులెందరికో జాబితాల్లో దక్కని చోటు
ఎన్నికల హామీని ఎగ్గొట్టారని బాబుపై ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రుణమాఫీని నమ్ముకుని జిల్లాలో రైతులు నిండా మునిగిపోయారు. కొర్రీలపై కొర్రీలు వేసి, సవాలక్ష సాంకేతిక ప్రతిబంధకాలతో చంద్రబాబు సర్కార్ విదిల్చిన రుణమాఫీ ‘భారం కొండంత మాఫీ చేస్తామన్న బాబు మాటలు నమ్మి మోసపోయామని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశం సర్కార్‌లో కనిపించడం లేదు. రాష్ట్రంలో అతి పెద్దదైన తూర్పుగోదావరి జిల్లాలో రైతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. జిల్లాలో రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 6.70 లక్షలు. పంట, బంగారు రుణాలన్ని కలిపి రూ.6,259 కోట్లు తీసుకున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో గద్దెనెక్కేందుకు ఇచ్చిన హామీ ప్రకారమైతే మొత్తం రుణాలన్నీ మాఫీ కావాలి. అలా కాక రెండు విడతలని మాట మడతేశారు. ఆ రెండు విడతల్లోనైనా అర్హులకు మాఫీ జరిగిందా అంటే అదీ లేదు. మొదటి విడత మాఫీ ఇంకా కొలిక్కి రాకుండానే రెండో విడత మాఫీ వంతు వచ్చేసింది. పోనీ అక్కడైనా ఒక క్రమపద్ధతిలో అర్హులకు మాఫీ ఫలితం అందిందా లేదన్నదే జవాబు.
తొలి విడత నుంచీ అదే తంతు
తొలి విడతలో 3.35 లక్షల మందికి రూ.348 కోట్లు రుణమాఫీ ఖాతాలకు జమ చేయనున్నట్టు ప్రకటించినా ఇప్పటి వరకు రూ.260 కోట్లు డిపాజిట్ చేసినట్టు బ్యాంకుల నివేదికలు చెబుతున్నాయి. పలు ప్రతిబంధకాలతో రూ.88 కోట్లు ఇంకా జమకాలేదంటున్నారు. రెండవ దశలో అయినా న్యాయం జరుగుతుందని రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. రెండవ విడ తలో 1,00,054 మంది రైతుల ఖాతాలకు రూ.222 కోట్లు విడుదల చేశారు. రెండో విడత అర్హుల జాబితాలు జిల్లా కేంద్రం కాకినాడ సహా పలు రెవెన్యూ డివిజన్‌కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. అరుుతే జాబితాల్లో తమ పేర్లు కన్పించడం లేదని అర్హులైన రైతులు మండిపడుతున్నారు. రుణమాఫీ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచామని చెప్పుకోవడమే తప్ప మాఫీ అయిందని చెప్పుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. తమకు అన్ని అర్హతులున్నా ఎందుకు మాఫీ వర్తించలేదని నిలదీస్తుంటే బ్యాంకు అధికారులు సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు.
కాగా ఒకే రైతు రెండు ఖాతాలు కలిగి ఉండటం, సర్వే నెంబర్లు సరిగా లేకపోవడం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తదితర వివరాలు సమగ్రంగా లేకపోవడంతో రూ.30 కోట్ల వరకూ నిలుపుదల చేసినట్టు అధికారులు అంటున్నారు. ఒకే విడతతో రూ.50 వేలు లోపు రుణాలు మాఫీ చెపుతున్న ఖాతాల సంఖ్య లక్షన్నరగా తేల్చారు. కానీ రూ.50 వేల రుణాలు దాటిన చాలా మందికి రైతుల్లో నిబంధనల పుణ్యమా అంటూ రూ.2 వేల నుంచి రూ.10 వేలకు మించి మాఫీ కాని వారి సంఖ్యే ఎక్కువ. బాబు మాటకు, మాఫీకి ఎక్కడా పొంతన లేదని రైతులు ఆగ్రహిస్తున్నారు.
వడ్డీ మాత్రమే మాఫీ..
లక్కవరం ఎస్‌బీఐలో నగలు పెట్టి తీసుకున్న రూ.75 వేల రుణం బాబు హామీతో మాఫీ అవుతుందని ఆశలు పెట్టుకున్నాను. వడ్డీ సుమారు రూ.18 వేలవగా ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో రూ.17,693 మాత్రమే మాఫీ అయింది. మాఫీ అయింది కాక మిగిలిన సొమ్ము చెల్లించి నగలు తీసుకెళ్లాలని బ్యాంకు సిబ్బంది చెప్పారు. కౌలు వ్యవసాయంలో నష్టపోరుు బయట అప్పులు కూడా చేశాను.
- మిరియాల సూర్యనారాయణ,
లక్కవరం, మలికిపురం మండలం.
రూ.50 వేల లోపు మాఫీ బూటకం
కాట్రేనికోన ఆంధ్రాబ్యాంకులో నగలు పెట్టి రూ. 50 వేల వ్యవసాయరుణం తీసుకున్నాను. రూ.50 వేల లోపు రుణం పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే రూ.50 వేల అసలుకు రెండు వేల వడ్డీ కలిపి రూ.52 వేల రుణం చూపించారు. రూ.5,067 మాత్రమే మాఫీ అయినట్టు సెల్‌కు మెసేజ్ వచ్చింది. అందులో ఇప్పుడు రూ.1,013 ఎకౌంట్‌లో జమ అవుతుందని చెపుతున్నారు.
- నల్లా వెంకన్నబాబు,
ఎన్.కొత్తపల్లి, ఉప్పలగుప్తం మండలం
ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు..
రెండు ఎకరాలలో వరిసాగు చేశాను. పెద్దాపురం ఆంధ్రా బ్యాంకులో రూ.లక్ష వరకు రుణం తీసుకున్నాను. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. బాబు చెబుతున్నట్టు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనను పరిగణలోకి తీసుకున్నా కనీసం రూ.48 వేల వరకు మాఫీ జరగాలి. అయినా మాఫీ జరగలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే మాఫీ చేసే ఉద్దేశంలో లేదని అనుమానంగా ఉంది.
- ఇనకొండ వీర విష్ణుచక్రం, శిరివాడ, పెద్దాపురం
ఎండమావిలో నీరే
Published Tue, May 26 2015 1:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement